Peddemul
-
పంచాయతీలో భార్యను బంధించిన భర్త
వికారాబాద్: గ్రామంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి మహిళా సర్పంచ్, సెక్రటరీ, ఇద్దరు వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించాడు. అయితే నిర్బంధించిన మహిళా సర్పంచ్ బాధితుడి భార్య కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామ పంచాయితీ పరిధిలో తాను చేసిన అభివృద్ధి పనులకు డబ్బులు చెల్లించడం లేదని సర్పంచ్ భర్త కూర్వ మల్లేశం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వార్డు సభ్యులను నిర్బంధించారు. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచిగా కూర్వ శివలీల సర్పంచ్ గా ఉన్నారు. ఆమె భర్త మల్లేశం గ్రామంలో గుంతలు పూడ్చడం, బోరు మోటార్లు మరమ్మతులు చేయడం వంటి పనులు చేయించారు. ఇందుకోసం సుమారు 1.30 లక్షలు ఆయనకు బిల్లులు రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఎంబీ రికార్డులు కూడా పూర్తయ్యాయి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా జాయింట్ సంతకంతో వచ్చిపడింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు సంతకం చేస్తేనే బిల్లులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఉప సర్పంచ్ ఎవరు లేకపోయినా ఒక మహిళా వార్డు సభ్యులకు జాయింట్ సంతకం అథారిటీ ఇచ్చారు. ఆమె సంతకం పెట్టడం లేదని అందువల్ల తనకు బిల్లు చెల్లింపు కావడం లేదని మల్లేశం ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించేందుకు వచ్చిన సర్పంచ్ శివలీల, పంచాయతీ కార్యదర్శి పరమేష్, వార్డు సభ్యులు మాణిక్యమ్మ, లక్ష్మీలను గ్రామపంచాయతీలో నిర్బంధించారు. జీపీ కార్యాలయానికి తాళం వేసుకొని తనకు డబ్బులు చెల్లిస్తేనే తాళం తీస్తానని మొండికేశారు మల్లేశం. తమను విడిచి పెట్టాలని పంచాయతీ కార్యదర్శి సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. బిల్లులు చెల్లించేందుకు తన వద్ద ఎలాంటి పవర్ లేదని సెక్రటరీ చెప్పుకొచ్చారు. మీ సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాలు అయితే బిల్లులు వస్తాయని తానేమి చేయలేనని చెప్పి సముదాయించారు. ఓ గంట తర్వాత అతడు కార్యాలయానికి వేసిన తాళం తొలగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఉపాధి కల్పిస్తాం.. వలస వెళ్లొద్దు
సాక్షి, పెద్దేముల్: చెంచు కుటుంబాలు వలస వెళొద్దని గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కోటయ్య, పీఓ ఐటీడీఏ (శ్రీశైలం), పీఓ డాక్టర్ వెంకటయ్యతో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఇటీవల గ్రామంలో నుంచి చెంచు కుటుంబాలు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు బతుకు దెరువుకోసం వెళ్లారు. శివ అనే నాలుగు సంవత్సరాల బాబు చదువుకోవడం లేదని బీజాపూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆయా కుటుంబాలను గ్రామానికి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆయేషా గ్రామంలోని చెంచు కుటుంబాలను కలిశారు. చైతన్యనగర్ గ్రామంలో చెంచుకుటుంబాలు ఎన్ని ఉన్నాయనే విషయమై ఆర్డీఓ వేణుమాధవరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో బడి బయట ఉన్న పిల్లల వివరాలను సేకరించి పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోనుంచి చెంచు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లవద్దని కోరారు. తల్లిదండ్రులు గ్రామంలోనుంచి ఉపాధి కోసం వలస వెళితే పిల్లల చదువులు సాగవని అన్నారు. గ్రామంలో వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్న భూములను ప్రభుత్వం చదును చేస్తుందని అన్నారు. బడీడు పిల్లలకు ఎలాంటి పనులు చెప్పరాదని అన్నారు. పిల్లలను చదివిస్తేనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతాయని అన్నారు. గ్రామం లోని కుటుంబాలకు ఉపాధిహమీ పథకం ద్వారా 180 రోజుల పాటు పనిదినాలు కల్పిస్తామని అన్నారు. గతంలో గ్రామానికి అధిక సంఖ్యలో నిధులు మంజూరయ్యాయని అయితే గ్రామ ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో గ్రామాభివృద్ధి జరగడం లేదన్నారు. మహిళలకు, రైతులకు రుణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గ్రామంలో 20 కుటుంబాలకు భూములను పంపిణీ చేసి పాసుబుక్‌లను సైతం జారీచేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ చైతన్యనగర్‌లో చైతన్యం మాత్రం రావడం లేదన్నారు. గ్రామంలో నుంచి ప్రజలు వలసలు వెళ్లడం తగ్గించుకుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. చెంచు కుటుంబాలకు గిరివికాసం పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించనుందన్నారు. బాండేడ్ లేబర్ యాక్టు ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పిల్లల చదువుల కోసం గ్రామంలో ఎన్సీఎల్పీ కేంద్రం నిర్వహించి విద్యార్థులు చదువుకునేలా చేస్తామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రామంలో చెంచు కుటుంబాలకు విద్యుత్ సరఫరా 100 యూనిట్లలోపు వినియోగిస్తే ఉచితంగా విద్యుత్ సరఫరా ఉంటుందని బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని తెలిపారు. కార్మిక శాఖ అధికారులు త్వరలో గ్రామానికి వచ్చి లేబర్ కార్డులను జారీచేస్తారని ఈ కార్డులు పొందినవారికి పిల్లల పెళ్లిళ్లకు రూ.30 వేలు, కాన్పుల సమయంలో మరో రూ.30 వేల చొప్పున అందించడం జరుగుతుందని, ప్రమాదాలు సంభవిస్తే రూ.లక్ష అందుతోందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరా>రు. గ్రామంలోనే ఉపాధి పొందేందుకు గేదెలు, ఆవులు అందించాలి. స్వయం ఉపాధి కోసం రుణాలను అందించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి ఆర్డీఓ వేణుమాధవరావు, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు అధికారి హ్మన్మంత్‌రావు, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రత్నమ్మ,సర్పంచ్ లలిత, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. -
గుడ్డు లేదు.. పండు లేదు!
సాక్షి, పెద్దేముల్: మధ్యాహ్న భోజన పథకంలో శ్రావణ మాసం అంటూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఇదేమని అడగితే గుడ్డు బదులు పండు ఇస్తున్నామంటున్నారు. తీరా ఏది ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది మధ్యాహ్న భోజన బిల్లులు రానిది గుడ్డు ఎలా పెట్టాలని ఆయాలు చెబుతున్నట్లు తెలస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారం తప్పకుండా విద్యార్థులకు గుడ్డు ఇవ్వాలి. పలు పాఠశాలల్లో వారంలో రెండు సార్లు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల్లో హెచ్ఎంలు ఒక్క గుడ్డుకు రూ.4 బిల్లు చేస్తుంటారు. దానికి తోడు పాఠశాలల్లో మెనూ కూడా సరిగా పాటించడం లేదు. వారంలో రెండు సార్లు కిచిడీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్య లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్‌ను వివరణ కోరగ శ్రావణ మాసంలో గుడ్డు బదులు తప్పకుండా పండు ఇవ్వాలన్నారు, పండ్లు ఇవ్వక పొతే బిల్లు చేసే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయాన్ని పాఠశాలల హెచ్ఎంలకు తెలియచేస్తామన్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సాక్షి, పెద్దేముల్: బోరుబావి తవ్వకం ఓ నాయకుడి ప్రాణాలను బలితీసుకుంది. గ్రామ ప్రజలకు ఎంతో ఆత్మీయుడిగా అపన్నహస్తం అందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే పొలానికి సాగునీరు అందక పంట ఎండిపోతుందని బోరుబావి తవ్విస్తుండగా పక్కపొలానికి చెందిన అన్నదమ్ములు టీఆర్ఎస్ నాయకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. దీంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాండూరు డీఎస్పీ రామచంద్రడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన దేశ్‌పాండే చంద్రవర్మ ప్రసాద్‌రావు(55) కొన్నాళ్లుగా కుటుంబంతో సహా హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గ్రామంలో 40ఎకరాలకు పైగా పొలం ఉంది. ప్రసాద్‌రావుకు సర్వే నంబర్ 358నంబర్ గల భూమిలో పండిస్తున్న వరి పంట, మామిడి తోటలకు సాగు నీరు అందక ఎండిపోతుందని ప్రసాద్‌రావు పొలంలో మంగళవారం బోరు వేయిస్తున్నాడు. అయితే పక్క పొలానికి చెందిన సోదరులు గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, శివారెడ్డిలు తమ పొలం పక్కనే బోరుబావి తవ్వడం తెలుసుకుని దేశ్‌పాండే ప్రసాద్‌రావు వద్దకు వెళ్లి గొడవకు దిగారు. వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో అన్నదమ్ములు కర్రలతో, మట్టి పెళ్లలతో ప్రసాద్‌రావుపై దాడి చేశారు. దాడి జరుగుతుండగా పక్కన ఉన్న వారు విడిపించేందుకు యత్నించారు. అయితే ఆ సోదరులు అతికిరాతకంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్న వారిపైకి వెళ్లారు. దీంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రసాద్‌రావు ప్రాణాలు పోయే వరకు దాడి చేశారని పోలీసుల విచారణలో తేలింది. పాతకక్షలతోనే హత్య చేశారా..? దారుణ హత్యకు గురైన ప్రసాద్‌రావుకు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల అంజిల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, శివారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండటంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయంతో ప్రసాద్‌రావు పక్కపొలానికి చెందిన వారితో పలు సార్లు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో పాత కక్షలు, రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రసాద్‌రావును దారుణంగా హత్య చేశారని గ్రామస్తులు అంటున్నారు. అపన్నహస్తం అందించే నాయకుడిగా.. హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడు ప్రసాద్‌రావు గ్రామ ప్రజలకు ఆత్మీయుడిగా అపన్నహస్తం అందించే నేతగా ఉన్నాడు. గతంతో సర్పంచ్‌గా ప్రసాద్‌రావు భార్య రజినిపాండే కొనసాగారు. ప్రసాద్‌రావుకు భార్య రజిని, కుమారుడు, కూతురులున్నారు. కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్‌రావు 6నెలల మంబాపూర్ గ్రామంలోనే ఎక్కువుగా ఉంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రతీసారి జరిగే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్‌లుగా తన వర్గానికి చెందిన వారినే గెలిపిస్తూ గ్రామంలో పట్టు సాధించాడు. ముందస్తు ఎన్నికల నాటి నుంచి మంబాపూర్ గ్రామంలోనే ఉంటున్నారు. గ్రామంలో ఏ కార్యం జరిగిన ప్రసాద్‌రావు హాజరవుతు పార్టీలకతీతంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థులు ఈ హత్యకు పథకం వేశారని పలువురు అంటున్నారు. మంచి పేరున్న నాయకుడిగా మారిన ప్రసాద్‌రావు హత్య జరిగిన ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకుని రోదించారు. విచారణ చేసిన డీఎస్పీ రామచంద్రుడు మంబాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు హత్యకు గురైన విషయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై సురేష్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై గ్రామస్తులతో రెండు గంటల పాటు విచారణ చేశారు. పొలంలో వేసిన బోరు బావిని పరిశిలించారు. బోరు బావి తవ్వకం చేస్తున్న సమయంలో ఉన్న వారితో మాట్లాడి వివరాలను సేకరించారు. మృతుడి భార్య పిల్లలు హైదరాబాద్ నుంచి రాత్రి 8గంటల వరకు చేరుకోలేదు. -
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య
పెద్దేముల్: పిల్లలు పుట్టలేదని మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పాండు (32), కవిత (27)లకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయం గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాండు, కవిత బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కోట్‌పల్లి ప్రజల కల నెరవేర్చండి
కోట్‌పల్లి మండలంగా ప్రకటించండి డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి పెద్దేముల్: ‘పదవులు.. నిధులు.. అడగటం లేదు.. 30 ఏళ్లుగా కోట్‌పల్లి గ్రామ ప్రజలు కల నెరవేర్చండి.. మండలంగా ప్రకటించండి..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కోట్‌పల్లి మండలంగా ప్రకటించాలని కోరుతూ ఆ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటితో 9వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షల్లో డ్వాక్రా మహిళలు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలకు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్ మహరాజ్, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరి స్వరూప, సీసీఐ రాములు, వెంకటచారి, శ్రీనివాస్‌చారి, నర్సింలు, లక్ష్మన్, గయాజ్, ముజీబ్ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోట్‌పల్లిని మండల కేంద్రంగా ప్రకటించకపోతే జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిని అడ్డుకుంటామని, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామమన్నారు. 1983లో కోట్‌పల్లి మండల కేంద్రంగా ప్రకటించాల్సి ఉండగా.. రాజకీయ ఒత్తిళ్లతో బంట్వారాన్ని మండల కేంద్రంగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్‌పల్లి గ్రామ ప్రజలు తొమ్మిది రోజుల నుంచి రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నా ప్రభుత్వానికి ఎందుకు చలనం రాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి మహేందర్‌రెడ్డి చొరవ తీసుకుని కోట్‌పల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోట్‌పల్లిని మండల కేంద్రంగా చేయకపోవడం ఇది రాజకీయ నాయకుల కుట్ర అని, తాండూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాజుగౌడ్ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఇన్చార్జి ఎల్లారెడ్డి, ప్రవీణ్ పటేల్, యాలాల మండల ఇన్చార్జి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక యువతికి 'కళ్యాణలక్ష్మి' డబ్బులు
పెద్దేముల్ (రంగారెడ్డి) : కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా కర్ణాటకకు చెందిన యువతికి డబ్బులు ఇచ్చారంటు ఓ వ్యక్తి సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో మంగళవారం వెలుగుచూసింది. ఓ వైపు కళ్యాణ లక్ష్మి పథకం పక్కదారి పడుతోందని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటే.. మరో వైపు కొందరు నకిలీ ధృవ పత్రాల సాయంతో కళ్యాణ లక్ష్మి డబ్బులు స్వాహా చేస్తున్నారని ఆత్కూర్ తండాకు చెందిన రాందాస్ వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజకు పిర్యాదు చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా మగ్ధల్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి స్థానిక తండాకు చెందిన యువకుడితో వివాహం జరిగింది.ఆ అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలో జన్మించిందని దొంగ సర్టిఫికెట్లు సృష్టించి కళ్యాణ లక్ష్మి డబ్బులు తీసుకున్నారంటు రాందాస్ మంగళవారం పెద్దేముల్‌కు వచ్చిన సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్ బుధవారంలోగా పూర్తి నివేదిక అందజేయాలని తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
నకిలీనోట్లతో బ్యాంకుకు వెళ్లిన మహిళ
పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ విజయా బ్యాంకులో ఒక మహిళ తన అకౌంట్లో జమచేసేందుకు నకిలీ నోట్లు తీసుకురావడంతో బ్యాంకు సిబ్బంది కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పెద్దేముల్లో పాలిష్ కంపెనీలో పనిచేస్తున్న అలివేలు అనే మహిళ తన అకౌంట్లో జమ చేసేందుకు రూ. 40 వేలు విలువైన వెయ్యిరూపాయల నోట్లు తెచ్చింది. వాటిని పరిశీలించిన బ్యాంకు అధికారులు అవి నకిలీవని గుర్తించారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తాను పనిచేసే యజమాని ఈ నోట్లు ఇచ్చాడని అలివేలమ్మ పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోట్’ కష్టాలు
- కాల్వలు శిథిలం.. ఆయకట్టుకు అందని నీరు - లక్ష్యం ఆయకట్టులో సగం కూడా పారని వైనం.. - నిలిచిపోయిన ‘జైకా’ నిధులు - ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం - అన్నదాతను ఆదుకోని ప్రాజెక్టు ధారూరు/ పెద్దేముల్ : తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని ధారూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన సుమారు 21 గ్రామాల ఆయకట్టుకు నీరందించేందుకు 1967 సెప్టెంబర్ 8న అప్పటి కేంద్ర గనుల శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో సాగు విస్తీర్ణ సామర్థ్యాన్ని 9,200 ఎకరాలుగా స్థిరీకరించారు. ధారూరు మండలంలోని ఎడమ కాల్వను 11 కిలోమీటర్ల పొడవు, 1.6 కి.మీ. పొడవుతో బేబీ కెనాల్‌ను నిర్మించారు. పెద్దేముల్ మండలంలోని 18 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో 24 కి.మీ. పొడవుతో కుడి కాల్వను నిర్మించారు. మొదట్లో ఈ కాల్వలు చివరి భూములకు సైతం నీరందించి పొలాలను సస్యశ్యామలం చేశాయి. కాలగమనంలో కాల్వలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం కుడి కాల్వ ద్వారా పొలాలకు సరిగ్గా అందడంలేదు. ఎడమ కాల్వ 4 కి.మీ. వరకే పరిమితమయ్యింది. ఇక బేబీ కెనాల్ సంగతి సరేసరి. ప్రస్తుతం మూడు కాల్వలు కలిసి 4 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నాయి. కాల్వలు శిథిలం కావడం, షట్టర్లను దొంగలెత్తుకెళ్లడం, నీరంతా తూముల్లోంచి బయటకు వెళ్లిపోవడం, కాల్వలకు గండ్లు పడి ఊటవాగు, మేకలోని వాడుకల ద్వారా కాగ్నాలో కలిసిపోతోంది. దీంతో యేటా పచ్చటి పొలాలు బీడులుగా మారుతున్నాయి. దీంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోతుండటంపై వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రూ.కోట్లు మట్టిపాలు.. ప్రతి యేటా కోట్‌పల్లి ప్రాజెక్టు కాల్వలకు ప్రభుత్వం రూ. కోట్లు కేటాయిస్తోంది. కానీ.. టెండర్ పనులు లేకుండా నామినేటెడ్ పనులు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్వినియోగమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 1996లో రూ. 57 లక్షలు కేటాయింపులు జరిగాయి. కానీ నాసిరకం పనులతో కాల్వలు సంవత్సరం తిరక్కుండానే యథాస్థితికి చేరాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రూ. లక్షల్లో మరమ్మతుల పేరిట నిధులు కేటాయిస్తున్న నాసిరకం పనులతో కాల్వలు బాగుపడటం లేదు. 2012, 13లలో రూ. 40 లక్షల చొప్పున కేటాయించినా.. కొంతమంది నాయకులు నిధులు కాజేసి.. పనులు తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. జైకా నిధుల జాడేదీ..? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రూ. 24.95 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు అప్పటి మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవ కారణంగా మంజూరయ్యాయి. కానీ రాష్ట్రం విడిపోవడంతో నిధులు విడుదల ఆగిపోయింది. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జైకా నిధులతో సంబంధం లేకుండా తాజాగా కాల్వల మరమ్మతుల కోసం ప్రభుత్వమే నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఎటువంటి ప్రయోజనం లేదు జిల్లాలో అతిపెద్ద నీటి ప్రాజెక్టు ఉన్నా రైతులకు ఎలాం టి ప్రయోజనం లేకుండాపోయింది. ప్రతి యేటా ప్ర భుత్వం కాల్వల మరమ్మతులకు రూ. కోట్లు ఇస్తున్నా.. ఆశయం నెరవేరడంలేదు. ఎకరా భూమి కూడా తడవడం లేదు. - రాములు, రైతు, మంబాపూర్ బీడులుగా చివరి భూములు ప్రాజెక్టు నిర్మించిన మొదట్లో కొన్ని సంవత్సరాలు చివరి భూములకు నీరందేది. గత 20 ఏళ్లుగా చుక్క నీరూ రావటం లేదు. పచ్చని పొలాలు బీడులుగా మారుతున్నాయి. - ప్రకాశం, రైతు, మంబాపూర్ -
మనస్తాపంతో సెల్‌టవర్ ఎక్కిన రైతు
పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) : విద్యుత్ కష్టాలతో మనస్తాపం చెందిన ఓ రైతు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో సెల్ టవర్ ఎక్కాడు. రైతు జాగరి నర్సప్ప ఎనిమిది ఎకరాల్లో అరటి, ఒక ఎకరంలో ఉల్లి పంట వేశాడు. అయితే, గత 15 రోజులుగా తీవ్ర విద్యుత్ అంతరాయాలతో పంటలకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొనడంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్దేముల్లో సెల్‌టవర్ ఎక్కిన అతడు న్యాయం చేయాలని, లేకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. స్థానికులు అతనికి ఏదోలా నచ్చజెప్పి కిందకు వచ్చేలా చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. -
దయ్యాలు తిరుగుతున్నాయి..
పెద్దెముల్(రంగారెడ్డి): 'అదిగో.. అటు చూడండి.. దయ్యాలు తిరుగుతున్నాయ్.. మనుషుల్ని పీక్కుతింటాయ్..' అంటూ గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తున్న కొందరి వ్యవహారం కుటుంబ సభ్యులకు భయం కలిగించడంతోపాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్న కొందరి వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమంటే.. కల్తీ కల్లుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అది అందుబాటులో లేకపోవడంతో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి పూట దయ్యాలు వస్తున్నాయని.. అందరినీ పీక్కొతింటాయని వింత వింతగా మాట్లాడుతున్నారు. దీంతో గ్రామస్థులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. -
ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు!
పెద్దేముల్: పన్నెండేళ్ల వయసులో ఉన్న ఊరు.. కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి బతుకుదెరువు కోసం వెళ్లిన ఓ బాలుడు ఇరవై ఏళ్ల తర్వాత భార్యాపిల్లలతో సొంత గ్రామానికి వచ్చాడు. కొడుకు ఇక రాడేమోనని దిగులుతో ఉన్న తల్లిదండ్రులు.. తమ కుమారుడు భార్యాబిడ్డలతో రావడంతో ఉద్వేగంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సోదరి రాఖీ కట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన లింబ్యానాయక్, సోనాబాయి దంపతులకు కూతురు కిమ్నీబాయి, కుమారులు దుర్గ్యానాయక్, హర్యానాయక్, సురేష్ ఉన్నారు. దుర్గ్యానాయక్ 12 ఏళ్ల వయసులో ఉండగా.. పని కోసం పుణే వెళ్లాడు. అక్కడ పని దొరక్కపోవడంతో ఓ లారీపై క్లీనర్‌గా పనిచేయసాగాడు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ వెళ్తుండగా మార్గంమధ్యలో దుమ్ముగూడ తండాకు చెందిన అనూషబాయి పరిచయమైంది. అనంతరం కొంతకాలానికి ఆమె చెల్లెలు చాలుబాయిని దుర్గ్యానాయక్ వివాహం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ స్థానికంగా ఇస్లామ్పూర్ దగ్గర ఓ దాబాలో పనిచేయసాగాడు. ఇతడికి పిల్లలు సోను (7), అభిషేక్ (5), హరిత (1) ఉన్నారు. దుర్గ్యానాయక్ (32) ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను గుర్తుచేసుకొని స్వగ్రామానికి శనివారం భార్యాపిల్లలతో కలసి వచ్చాడు. తమ కుమారుడు ఇక రాడేమోననే బెంగతో ఉన్న తల్లిదండ్రులు దుర్గ్యానాయక్తో పాటు కోడలు, మనవలు, మనవరాలిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శనివారం రాఖీ పండుగ సందర్భంగా దుర్గ్యా నాయక్‌కు సోదరి కిమ్నీబాయి రాఖీ కట్టింది. -
వామ్మో.. ఇవేం బిల్లులు
పెద్దేముల్: గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కరెంట్ బిల్లులు రూ.లక్షల్లో వస్తుండడంతో సర్పంచులు కంగుతింటున్నారు. యేడాదికి రూ. ఐదువేలు ఆదాయం రాని పంచాయతీలకు రూ.లక్షల్లో బిల్లులు వస్తే ఎలా చెల్లించాలని పలు గ్రామాల సర్పంచులు వాపోతున్నారు. మూడు రోజులుగా మండలంలోని సర్పంచులకు విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లులు, నోటీసులు పంపిస్తున్నారు. మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు, 27 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ కార్యాలయం, వీధిదీపాలు, తాగునీరు సరఫరా చేసేందుకు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు నోటీసులు జారీచేశారు. నోటీసులు చూసిన సర్పంచులు అవాక్కవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు కరెంట్ బిల్లులు రావడం ఏమిటని వారు ఆశ్చర్యపోతున్నారు. పంచాయతీ ఏర్పడిననాటి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కచ్చితంగా చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో విద్యుత్ మీటర్లు లేవు, బిల్లులు ఎలా వేస్తున్నారో చెప్పాలని సర్పంచులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రావడం లేదు.. రూ.లక్షలకు లక్షలు బిల్లులంటే ఎట్లా కట్టేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చెరుకు రైతుకు తీపి కబురు
పెద్దేముల్: మెదక్ జిల్లా సంగారెడ్డిలోని గణేష్ చెరుకు ఫ్యాక్టరీ గురువారం నుంచి ప్రారంభం కానుందని పెద్దేము ల్, బంట్వారం ఏరియా మేనేజర్ రాఘవేందర్ పేర్కొన్నారు. పెద్దేముల్ మం డల కేంద్రంలో మంగళవారం చెరుకు రైతులతో ఆయన మట్లాడారు. రైతులకు సకాలంలో లారీల కొరత లేకుం డా చూస్తానన్నారు. పెద్దేముల్, బం ట్వారం మండలాల్లో ఈ యేడాది 64 వేల టన్నుల చెరుకు కొనేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. బంట్వా రం మండలంలో 1,026, పెద్దేముల్లో 2,107 టన్నుల చెరుకు ఇప్పటివరకు రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. ఈ యేటా టన్నుకు రూ.2600 చెల్లిస్తామన్నారు. రోడ్డు మరమ్మతు చేయాలి.. రైతులు చెరుకు పంటను అమ్ముకునే ందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోంది. పెద్దేముల్-సంగారెడ్డి రోడ్డు అధ్వానంగా మారడంతో రవాణాకు ఇబ్బం దిగా ఉంది. పండించిన చెరుకు అమ్ముకునేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దళారులను ఆశ్రయిం చాల్సి వస్తోందన్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంగారెడ్డి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి.. సంగారెడ్డి గణేష్ ప్యాక్టరీ యజమాన్యం రైతులకు అందజేస్తున్న ఎరువులను మండల కేంద్రంలో అందుబాటులో ఉంచాలని పెద్దేముల్ గ్రామ రైతులు కొరుతున్నారు. ప్రతియేటా ఎరువులు అందచేస్తున్న సమయానికి అందచేయ టం లేదని, మండల కేంద్రంలో ఎరువులు అందజేయాలని కోరుతున్నారు. -
పాత ఇళ్లకే బిల్లులు!
పెద్దేముల్: ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై గురువారం సీబీసీఐడీ అధికారులు మండల పరిధిలోని రేగొండిలో రెండోసారి విచారణ జరిపారు. గ్రామంలో మంజూరైన 291 ఇళ్లకు 290 ఇళ్లు పూర్తిగా నిర్మాణమైనట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. కాగా వీటిలో సగానికి పైగా పాత ఇళ్లకే అధికారులు బిల్లులు ఇచ్చినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబీకులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకున్న కందనెల్లి వెంకటమ్మ, బంటు నర్సింలు, బంటు హన్మంతు, లక్ష్మమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మ, కొలుకుందె ఎల్లమ్మ, కోనేరు లక్ష్మి, కూర నర్సింలు, కె.వెంటకమ్మ, చంద్రకళ, కూర నర్సమ్మ తదితరుల ఇళ్లతో పాటు మొత్తం 50 ఇళ్లను సీబీసీఐడీ అధికారులు గురువారం పరిశీలించారు. జిల్లాలోని బషీరాబాద్, రేగొండి, కుల్కచర్లతో పాటు పలు గ్రామాల్లో తనిఖీలు చేశామని, ఒకే రేషన్ కార్డుపై కూడా రెండు ఇళ్లు మంజూరైనట్లు గుర్తించినట్లు సీబీ సీఐడీ అధికారులు చెప్పారు. పెద్దేముల్, బషీరాబాద్ తదితర మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరుపగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించామని, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటికి రూ.41,000 బిల్లు రావాల్సి ఉండగా అధికారులు కేవలం రూ.30 వేలు, 10 బస్తాల సిమెంట్ మాత్రమే ఇచ్చారని లబ్ధిదారులకు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలియచేశారు. అధికారులు చనిపోయిన వారి పేర్ల మీద బిల్లులు ఇస్తే చర్యలు తప్పవని సీబీసీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రజలు స్వచ్ఛంధంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్రమాలకు గ్రామస్తులు సహకరించరాదని పేర్కొన్నారు. కాగా అధికారుల తనిఖీలతో కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. ఎంతటివారైనా చర్యలు తప్పవు.. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని, అక్రమార్కులు ఎంతటివారైనా కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ అధికారులు హెచ్చరించారు. మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు తేలినా, అధికారులు-లబ్ధిదారులు కుమ్మకై ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. బిల్లులపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమాలు తెలుసుకునే క్రమంలో ఇళ్లు ఎప్పుడు నిర్మాణమయ్యాయనే విషయమై నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెంట సంబంధిత శాఖ ఇన్స్పెక్టర్లు జితేందర్‌రెడ్డి, రాజ్‌గోపాల్, తాండూరు హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ ఉన్నారు. -
పెద్దేముల్లో అర్ధరాత్రి హైటెన్షన్
పెద్దేముల్: మండల పరిధిలోని తొర్మామిడి చౌరాస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేట కోసం వచ్చిన నలుగురు వ్యక్తులు కాల్పులు జరపడంతో పోలీసులు అలర్టైపెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులను చూసిన వేటగాళ్లు బైక్‌పై పారిపోయే ప్రయత్నంలో బండరాయిని ఢీకొట్టారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ సర్పంచు లొంక నర్సిములు సోమవారం సాయంత్రం తాండూరుకు వచ్చి రాత్రి 10:30 గంటలకు తిరిగి గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పెద్దేముల్-తొర్మామిడి చౌరస్తా వద్దకు రాగానే ఆయన బైక్ పంక్చర్ అయింది. దీంతో దాన్ని నెట్టుకుంటూ వస్తున్న నర్సింలు తనను నలుగురు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గమనించాడు. దీంతో గ్రామస్తులకు, పెద్దేముల్ ఎస్ఐ రమేష్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అంతలోనే ఆ నలుగురు వ్యక్తులు గొట్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకుగురైన పెద్దేముల్ ఎస్ఐ వెంటనే తాండూరు డీఎస్పీ, రూరల్ సీఐలకు సమాచారం ఇచ్చాడు. దీంతో మరికొంత మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం 30 మంది పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. తప్పించుకోబోయి ఢీకొట్టారు గాలింపులో దుండగుల ఆచూకీ తెలియకపోవడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చౌరస్తా వద్ద పోలీసులు పికెటింగ్ వేశారు. ఇంతలోనే కొద్ది దూరం నుంచి నలుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై రావడాన్ని గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే దుండగులు ఆ బైక్‌ను ఆపకుండా అలాగే వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు బైక్‌ను వెంబడించారు. గొట్లపల్లి గేటు సమీపంలో వేగంగా వెళుతున్న బైక్ పెద్ద బండరాయికి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరు అక్కడినుంచి పరారయ్యారు. కాల్పులు జరిపింది వీరే.. అంతకుముందు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి, కాల్పులు జరిపింది తామేనని గాయపడిన ఇద్దరు చెప్పినట్లు తెలిసింది. చనిపోయిన వ్యక్తి పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండాకు చెందిన రమేష్(29) అని గాయపడ్డ ఇద్దరు బద్రు, వినోద్లని పోలీసులు గుర్తించారు. రమేష్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మంగళవారం ఉదయం జిల్లా అదనపు ఎస్పీ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మందుగుండు స్వాధీనం తాండూరు రూరల్: ఈ నలుగురు అటవీ ప్రాంతంలో నెమళ్లు, కుందేళ్ల వేటకు వచ్చారా లేక దారి దోపిడీకి వచ్చారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ షెక్ ఇస్మాయిల్ తెలిపారు. సంఘటన స్థలం నుంచి రెండు టార్చిలైట్లు, కొంత మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.