పెద్దేముల్: మండల పరిధిలోని తొర్మామిడి చౌరాస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేట కోసం వచ్చిన నలుగురు వ్యక్తులు కాల్పులు జరపడంతో పోలీసులు అలర్టైపెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులను చూసిన వేటగాళ్లు బైక్‌పై పారిపోయే ప్రయత్నంలో బండరాయిని ఢీకొట్టారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ సర్పంచు లొంక నర్సిములు సోమవారం సాయంత్రం తాండూరుకు వచ్చి రాత్రి 10:30 గంటలకు తిరిగి గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు.
మార్గంమధ్యలోని పెద్దేముల్-తొర్మామిడి చౌరస్తా వద్దకు రాగానే ఆయన బైక్ పంక్చర్ అయింది. దీంతో దాన్ని నెట్టుకుంటూ వస్తున్న నర్సింలు తనను నలుగురు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గమనించాడు. దీంతో గ్రామస్తులకు, పెద్దేముల్ ఎస్‌ఐ రమేష్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. అంతలోనే ఆ నలుగురు వ్యక్తులు గొట్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకుగురైన పెద్దేముల్ ఎస్‌ఐ వెంటనే తాండూరు డీఎస్పీ, రూరల్ సీఐలకు సమాచారం ఇచ్చాడు. దీంతో మరికొంత మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం 30 మంది పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
తప్పించుకోబోయి ఢీకొట్టారు
గాలింపులో దుండగుల ఆచూకీ తెలియకపోవడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చౌరస్తా వద్ద పోలీసులు పికెటింగ్ వేశారు. ఇంతలోనే కొద్ది దూరం నుంచి నలుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై రావడాన్ని గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే దుండగులు ఆ బైక్‌ను ఆపకుండా అలాగే వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు బైక్‌ను వెంబడించారు. గొట్లపల్లి గేటు సమీపంలో వేగంగా వెళుతున్న బైక్ పెద్ద బండరాయికి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరు అక్కడినుంచి పరారయ్యారు.
కాల్పులు జరిపింది వీరే..
అంతకుముందు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి, కాల్పులు జరిపింది తామేనని గాయపడిన ఇద్దరు చెప్పినట్లు తెలిసింది. చనిపోయిన వ్యక్తి పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండాకు చెందిన రమేష్(29) అని గాయపడ్డ ఇద్దరు బద్రు, వినోద్‌లని పోలీసులు గుర్తించారు. రమేష్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మంగళవారం ఉదయం జిల్లా అదనపు ఎస్పీ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మందుగుండు స్వాధీనం
తాండూరు రూరల్: ఈ నలుగురు అటవీ ప్రాంతంలో నెమళ్లు, కుందేళ్ల వేటకు వచ్చారా లేక దారి దోపిడీకి వచ్చారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ షెక్ ఇస్మాయిల్ తెలిపారు. సంఘటన స్థలం నుంచి రెండు టార్చిలైట్లు, కొంత మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
పెద్దేముల్‌లో అర్ధరాత్రి హైటెన్షన్
Published Tue, Jul 22 2014 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement