మృతదేహం వద్ద విచారణ చేస్తున్న తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, సీఐ ఉపేందర్
సాక్షి, పెద్దేముల్: బోరుబావి తవ్వకం ఓ నాయకుడి ప్రాణాలను బలితీసుకుంది. గ్రామ ప్రజలకు ఎంతో ఆత్మీయుడిగా అపన్నహస్తం అందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే పొలానికి సాగునీరు అందక పంట ఎండిపోతుందని బోరుబావి తవ్విస్తుండగా పక్కపొలానికి చెందిన అన్నదమ్ములు టీఆర్‌ఎస్ నాయకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. దీంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాండూరు డీఎస్పీ రామచంద్రడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన దేశ్‌పాండే చంద్రవర్మ ప్రసాద్‌రావు(55) కొన్నాళ్లుగా కుటుంబంతో సహా హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గ్రామంలో 40ఎకరాలకు పైగా పొలం ఉంది. ప్రసాద్‌రావుకు సర్వే నంబర్ 358నంబర్ గల భూమిలో పండిస్తున్న వరి పంట, మామిడి తోటలకు సాగు నీరు అందక ఎండిపోతుందని ప్రసాద్‌రావు పొలంలో మంగళవారం బోరు వేయిస్తున్నాడు. అయితే పక్క పొలానికి చెందిన సోదరులు గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, శివారెడ్డిలు తమ పొలం పక్కనే బోరుబావి తవ్వడం తెలుసుకుని దేశ్‌పాండే ప్రసాద్‌రావు వద్దకు వెళ్లి గొడవకు దిగారు. వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో అన్నదమ్ములు కర్రలతో, మట్టి పెళ్లలతో ప్రసాద్‌రావుపై దాడి చేశారు. దాడి జరుగుతుండగా పక్కన ఉన్న వారు విడిపించేందుకు యత్నించారు. అయితే ఆ సోదరులు అతికిరాతకంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్న వారిపైకి వెళ్లారు. దీంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రసాద్‌రావు ప్రాణాలు పోయే వరకు దాడి చేశారని పోలీసుల విచారణలో తేలింది.
పాతకక్షలతోనే హత్య చేశారా..?
దారుణ హత్యకు గురైన ప్రసాద్‌రావుకు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల అంజిల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, శివారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండటంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయంతో ప్రసాద్‌రావు పక్కపొలానికి చెందిన వారితో పలు సార్లు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో పాత కక్షలు, రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రసాద్‌రావును దారుణంగా హత్య చేశారని గ్రామస్తులు అంటున్నారు.
అపన్నహస్తం అందించే నాయకుడిగా..
హత్యకు గురైన టీఆర్‌ఎస్ నాయకుడు ప్రసాద్‌రావు గ్రామ ప్రజలకు ఆత్మీయుడిగా అపన్నహస్తం అందించే నేతగా ఉన్నాడు. గతంతో సర్పంచ్‌గా ప్రసాద్‌రావు భార్య రజినిపాండే కొనసాగారు. ప్రసాద్‌రావుకు భార్య రజిని, కుమారుడు, కూతురులున్నారు. కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్‌రావు 6నెలల మంబాపూర్ గ్రామంలోనే ఎక్కువుగా ఉంటున్నాడు. టీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రతీసారి జరిగే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్‌లుగా తన వర్గానికి చెందిన వారినే గెలిపిస్తూ గ్రామంలో పట్టు సాధించాడు. ముందస్తు ఎన్నికల నాటి నుంచి మంబాపూర్ గ్రామంలోనే ఉంటున్నారు. గ్రామంలో ఏ కార్యం జరిగిన ప్రసాద్‌రావు హాజరవుతు పార్టీలకతీతంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థులు ఈ హత్యకు పథకం వేశారని పలువురు అంటున్నారు. మంచి పేరున్న నాయకుడిగా మారిన ప్రసాద్‌రావు హత్య జరిగిన ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకుని రోదించారు.
విచారణ చేసిన డీఎస్పీ రామచంద్రుడు
మంబాపూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకుడు హత్యకు గురైన విషయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై సురేష్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై గ్రామస్తులతో రెండు గంటల పాటు విచారణ చేశారు. పొలంలో వేసిన బోరు బావిని పరిశిలించారు. బోరు బావి తవ్వకం చేస్తున్న సమయంలో ఉన్న వారితో మాట్లాడి వివరాలను సేకరించారు. మృతుడి భార్య పిల్లలు హైదరాబాద్ నుంచి రాత్రి 8గంటల వరకు చేరుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment