ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి | villages development with people partnership | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

Published Sun, Sep 4 2016 9:17 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి - Sakshi

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

పెంచికల్‌దిన్నె (నేరేడుచర్ల) : 
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ కార్యక్రమానికి హాజరై అదనపు తరగతి గదులు,  డిజిటల్‌ క్లాస్‌ రూం ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలు ఆధునిక దేవాలయాలని..ఉపాధ్యాయులు దేవుళ్లు అని వారిని గుర్తించినప్పుడే గ్రామం ఉన్నతంగా ఉంటుందన్నారు. తాము జన్మించిన గ్రామానికి విద్యను అభ్యసించిన పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వాలన్న లక్ష్యం గొప్పదన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన గ్రామస్తులు పాఠశాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. ప్రతి గ్రామం పెంచికల్‌దిన్నె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే దేశం ముందంజలో ఉంటుందన్నారు. గ్రామాభివృద్ధికి పెంచికల్‌దిన్నె అసోసియేషన్‌ సోషల్‌ సర్వీసెస్‌ ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. సంస్థ లక్ష్యం నేరవేరె దిశగా కృషి చేయాలని కోరుతూ పాస్‌ లోగోను ఆవిష్కరించారు. అనంతరం గతంలో పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులను సత్కరించారు. సర్పంచ్‌ సుంకరి క్రాంతికుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సోసైటీ, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ గున్‌రెడ్డి కోటిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆరిబండి ప్రసాదరావు, రిటైర్డ్‌ జిల్లా ఉప విద్యాధికారి వల్లంశెట్ల కృష్ణారావు, జర్నలిస్ట్‌ల యూనియన్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీఓ నాగపద్మజ, ఈఓఆర్‌డీ జ్యోతిలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు విజయకుమారి, రమణారెడ్డి, పాస్‌ అధ్యక్షుడు వలంశెట్ల లచ్చయ్య, సభ్యులు జ్యోతి, వల్లంశెట్ల నర్సింహారావు, డాక్టర్‌ యశోద, డాక్టర్‌ రవి, ఎంపీటీసీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement