వైభవం.. వీరబ్రహ్మం జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 408వ జయంత్యుత్సవాలు రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి పుట్టిన రోజు కావటంతో వేద పండితులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో మఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు సతీసమేతంగా.. పార్కులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి బయలుదేరారు. 101 మంది మహిళలు కలశాలతో అక్కడికి మేళతాళాలతో కలిసి వెళ్లారు. వేది పండితులు వేద మంత్రాలు పఠించగా మఠాధిపతులు విగ్రహమూర్తికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్యాణం..
వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబకు ఆలయ అర్చకులు కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మఠా«ధిపతుల దంపతులు, స్థానిక మఠం మేనేజరు ఈశ్వరాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రచారం లేక తగ్గిన భక్తులు:
మహోత్సవాలకు ఏటా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు పాల్గొనే వారు. ఈ ఏడాది కేవలం మండల భక్తులతోపాటు కొన్ని ప్రాంతాల నుంచి విశ్వబ్రాహ్మణులు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఇందుకు కారణం దేవస్థాన నిర్వాహకులు సరిగా ప్రచారం చేయకపోవటం వల్లనే అని భక్తులు ఆరోపిస్తున్నారు. గోడపత్రాలు, పత్రికల ప్రకటనలు, ఇతర జిల్లాల ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో గడిపేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నా ప్రచారం లేకపోవటం వలనే భక్తుల సంఖ్య తగ్గిందని స్థానికులతోపాటు వ్యాపారులు పేర్కొన్నారు.