ఎన్నికల ‘నోస్ట్రడామస్’ అలాన్ లిచ్‌మాన్ జోస్యం
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం.
అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు.
1984 నుంచి విశ్లేషణలు
1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు.
2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్‌గోర్‌పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్‌మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment