Prophecy
-
Nostradamus: కమలా హారిస్‌దే విజయం
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్‌గోర్‌పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్‌మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Chaganti Koteswara Rao: సహవాస ఫలం
కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...అంటున్న బద్దెన పద్యం ఇస్తున్న సందేశం ఏమిటంటే.. దుర్జనులతో స్నేహం చేయద్దని! అగ్నిహోత్రం కట్టెను పట్టుకుని కాల్చడం మొదలుపెడుతుంది. మంట వ్యాపించేకొద్దీ ఆ కట్టెను ఆశ్రయించి ఉన్న పురుగూపుట్రా అన్నీ పారిపోతాయి. అగ్నితో సంపర్కం పొందాక ఒక్క పురుగు కూడ లోపల ఉండలేదు. అలాగే సత్పురుషులతో సహవాసం చెయ్యడం మొదలుపెడితే నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా పడిపోతాయి. ఈశ్వర భక్తిచేత మారని గుణాలు కూడా మంచివారితో కలిసి ఉంటే తొలగిపోతాయి. మహాత్ముల చెంత చేరిన లోభిలో కూడా మార్పు వస్తుంది. తాను కూడా ఒక రూపాయి దానం చేసి సమాజం కోసం నిలబడాలన్న ఆలోచనలతో పరివర్తన చెందుతాడు. రావణాసురుడిని నమ్ముకున్న వారందరూ నశించిపోయారు. ఒక్కడు మిగల్లేదు. రామచంద్ర మూర్తిని నమ్ముకుని ఆయనతో కలిసున్న వారి సంగతి ఏమిటి! కొన్ని కోట్ల వానరాలు చచ్చిపోయినా, చిట్టచివర దేవేంద్రుడు ప్రత్యక్షమయి రాముడిని వరం కోరుకొమ్మంటే...‘నాకోసమని యుద్ధం చేయడానికి వచ్చి ఏ వానరాలు మరణించాయో అవన్నీ తిరిగి బతకాలి’ అని కోరుకున్నాడు. అటువంటి సత్పురుషుడిని ఆశ్రయించినందుకు చివరకు క్షేమంగా తిరిగి వెళ్లగలిగాయి. ‘‘కళత్రాణి సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యధైచ్ఛసి చిరం భోక్తుం మా కృథారామ విప్రియమ్... ’ దుర్మార్గుడయిన వ్యక్తి ఇంట్లో ఉంటే– తల్లికీ తండ్రికీ మనశ్శాంతి ఉండదు. భార్యాబిడ్డలు ప్రశాంతంగా బతకలేరు. ఇటువంటి దుర్మార్గుడు మా కుటుంబ సభ్యుడైనాడని బంధువులు, మిత్రులు అందరూ తలదించుకుంటారు. ఆయన ఉండే వీథిలోని వాళ్ళు, ఆ దుర్మార్గుడి ఊరివాళ్ళు కూడా విసుక్కుంటారు. ఒకవేళ ఆ దుర్మార్గుడే పాలకుడయితే ఆ జిల్లా, ఆ రాష్ట్రం పాడయిపోతుంది. అలా దుర్మార్గుడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉన్న ఇతరులు కూడా అతని ప్రభావానికి బలయిపోతారు. దుర్జనులతోడి సంపర్కం ప్రమాదకరం. వర్షపునీటితో గలాగలా పారినా ఏటినీళ్ళు ఎవరూ తాగరు, పుణ్యస్నానాలు చేయరు. అది వెళ్ళి గంగానదితో కలిస్తే...అది కూడా గంగే అయిపోతుంది. దానికీ ఆ పవిత్రత దక్కుతుంది. అక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. అదే గంగానది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలోంచి నీళ్ళు ఇంటికి కూడా తెచ్చుకోం. గంగ... గంగగా ఉపయుక్తం. ఏరు గంగలో కలిస్తే గంగయిపోయింది. గంగ సముద్రంలో కలిస్తే సముద్రమయింది. తాత్వికంగా అది గొప్పదే..కానీ గంగ గంగగా ఉన్నప్పటి ప్రయోజనం సముద్రంలో కలిసిన తరువాత ఉండదు. ఒక చీమ పూలదండలో ఉన్నది. ఆ దండను రాజు మెడలో వేసారు. చీమ నెమ్మదిగా పాకుతూ కిరీటం పైకి చేరుకుంది. దానిని చూసినా ఎవ్వరూ అక్కడనుండి తొలగించే సాహసం చేయలేదు. రాజు స్వయంగా గ్రహిస్తే తప్ప దాన్ని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే నువ్వు ఎవరితో ఉన్నావన్నదాన్నిబట్టి నీ స్థాయి, గౌరవం మారిపోతుంటుంది. కాబట్టి త్యజదుర్జన సంసర్గమ్... భజసాధు సమాగమమ్... మహాత్ములతో, సత్పురుషులతో కలిసి ఉండండి... వారు మిమ్మల్ని నిందించినా, వారి సాంగత్యాన్ని వదులుకోకండి. వారితో కలిసి ఉన్న కారణంగా మీ దుర్గుణాలు పోగొట్టుకోవడమే కాకుండా, మీరు కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రవచన నిధి..మల్లాది
అది దాదాపు 1955–60 మధ్య కాలం .. గుంటూరులోని బ్రాడీపేట మైదానంలో పురాణ పఠనం జరుగుతోంది. దాదాపు పది వేల మంది కూర్చుని ఉన్నారు. అప్పట్లో మైకుల ఏర్పాటు అన్నిచోట్లా కుదిరేది కాదు. అయినా ఆ మైదానంలో చేరిన చివరి వ్యక్తికి సైతం ఒక కంఠం స్పష్టంగా విన్పిస్తోంది. శ్రావ్యంగా, మరింత వినాలనిపించే రీతిలో సాగుతున్న పురాణ పఠనం వారిని కట్టిపడేసింది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతమంతా ఒక శ్రోతగా మారిపోయింది. అదే గుంటూరు ప్రాంతం. మహాభారత ప్రవచనం రెండేళ్లపాటు సాగింది. ఎన్నో గాథలు.. మరెన్నో కొత్త విషయాలు.. పిట్టకథలు.. సామాజిక కోణంలో కథనం.. ధర్మాచరణను నొక్కి చెప్పే నిగూఢ ప్రయత్నం.. సంప్రదాయాలు–విలువలు, నీతి నిజాయితీలు, ఆచరణీయాలు, నడవడిక, బతుకుకు అర్థం.. ఇలా ఒకటేమిటి, ధారాపాతంగా ఎన్నో విషయాలు.. ఆ రెండేళ్లూ ప్రతిరోజూ సాయంత్రం కాగానే ఆ మైదానానికేసి వేల మంది పయనం..అలాగే వరంగల్‌లో ఏడాది పాటు రామాయణ ప్రవచనం.. రాముడంటే ఓ పౌరాణిక పాత్ర కాదు, మనిషంటే ఇలా జీవించాలి అని శ్రోతలకు ఆలోచన పుట్టించే రీతిలో సాగిన పురాణం..ఆయన మాటే ఓ మంత్రం..ఆయనే మల్లాది చంద్రశేఖరశాస్త్రి. సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చు.. కానీ టీవీ చానళ్లలో నిత్యం వినిపించే ‘ప్రవచనాలకు’ మల్లాది చంద్రశేఖరశాస్త్రి ఆది. ఆయన 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మిం చారు. తల్లిదండ్రులు దక్షిణామూర్తి, అదిలక్ష్మ మ్మ ఆయనపై ఎక్కువగా ప్రభావం చూపినట్లు చెబుతారు. తన 15వ ఏట నుంచే చంద్రశేఖర శాస్త్రి ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు. అప్పటివరకు పురాణాలు చెప్పే తీరు వేరు.. మల్లాది వారు ప్రవచించటం ప్రారంభించిన తర్వాత అది మరో తీరు. రేడియోకు అతుక్కుపోయి పురాణ ప్రవచనం వినే వారి సంఖ్య అప్పట్లో లక్షల్లో ఉండేది. పురాణ కాలక్షేపం అన్న మాట చాలాకాలం విస్తృత వినియోగంలో ఉండేది. కానీ.. అది తప్పని, పురాణ ప్రవచనం అనాలి కానీ పురాణ కాలక్షేపం అనకూడదని, కాలక్షేపం అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లేనని మల్లాది అనేవారు. పురాణం వినటం కాలక్షేపం కోసం కాదు, జీవన గమనాన్ని మార్చుకునేందుకన్న విషయాన్ని గుర్తించాలని చెప్పేవారు. పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని జీవితానికి అన్వయించుకోవాలని ఆయన బలంగా చెప్పేవారు. 96 ఏళ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన చివరివరకు నిత్యం ఏదో ఓ గ్రంథాన్ని పఠిస్తూ ఉండేవారు. వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, వేదాంత భాష్యంలో విశేష ప్రవేశం ఉన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులుగా సామాజిక హితం కోసం విశేష కృషి చేశారు. తన తాతగారైన రామకృష్ణ విద్వన్ మహాఅహితాగ్ని వద్దే ప్రధాన విద్యనభ్యసించారు. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునేలా ప్రవచనం చేయడంలో మల్లాది సుప్రసిద్ధులు. సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించినట్టే.. టీవీలు విస్తృత ప్రాచుర్యంలోకి రాకముందు రేడియోల ద్వారానే ముఖ్య కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనం వినేవారు. వాటిల్లో ముఖ్యమైంది భద్రాద్రి రామకళ్యాణం. నాలు గైదు దశాబ్దాల క్రితం వరకు ఊరూరా రామనవమి వేడుకలు జరుగుతున్నా, భద్రాద్రి శ్రీ రామకల్యాణ వ్యాఖ్యానాన్ని రేడియోలో వినటానికి భక్తులు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ కణ్యాణ వ్యాఖ్యానంలో మల్లాదివారే కీలకం. చంద్రశేఖర శాస్త్రి కల్యాణ ఘట్టాన్ని కమనీయంగా వ్యాఖ్యానిస్తూంటే రేడియో సెట్ల ద్వారా దాన్ని వింటూ భక్తకోటి ప్రత్యక్షంగా తిలకిస్తున్న అనుభూతి పొందేవారు. ఆ తరహా వ్యాఖ్యానాన్ని ప్రారంభించింది ఆయనే. ఇక ప్రభుత్వ పక్షాన అధికారికంగా ఉగాది పంచాంగ పఠనానికి కూడా ఆయ నే ఆద్యుడు. రాష్ట్రమంతటా ప్రవచనాలు చెప్పటం ద్వారా అన్ని ప్రాంతాల్లో ఆయన అభిమానాన్ని చూరగొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏడాది రెండేళ్ల పాటు ప్రవచనాలు కొనసాగేవి. తెలుగు–సంస్కృతంలో ప్రవచనం చెప్పగలిగిన ఒకేఒక పౌరాణికులు ఆయన. దీంతో ఆయనకు ప్రవచన సవ్యసాచి అన్న బిరుదు వచ్చింది. ఇక అభినవ వ్యాసులు, పౌరాణిక సార్వభౌములు, మహామహోపాధ్యాయ, పురాణ వాచస్పతి లాంటి మరెన్నో బిరుదులున్నాయి. రాజలక్ష్మీ పురస్కారాన్ని అందుకున్నారు. మల్లాది మంచి మాటలు.. ‘మతమనేది మనం సృష్టించుకున్న మాటనే. ఆ పేరుతో భేద భావం కూడదు. ధర్మాచరణే ముఖ్యమైంది.. ’ సంతృప్తిని మించిన సంపద మరోటి లేదు. ధర్మంగా చేసే పనేదైనా, ఆదాయం ఎంతైనా సంతృప్తిగా ఉండాలి. పెద్ద సంపాదన ఉంటే అహంకారంతో ఉండటం సరికాదు. సదా దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి’ ‘నా మాట వినేందుకు వచ్చేవారు పేదలా, ధనవంతులా, పండితులా, పామరులా అన్న ఆలోచన నాలో ఉండదు. చెప్పే విషయాల్లో లీనమై ప్రవచిస్తాను. ధర్మంతో కూడుకున్న మాటలే చెబుతాను. నేను మాత్రమే గొప్పగా చెప్తానన్న అహంకారం నాలో లేదు.’ -
మా రాజాకి మీ భవిష్యత్తు తెలుసు
‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు.చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ‘అమ్మా, నీ మనసు మంచిది. ముక్కుసూటిగా మాట్లాడతవు. అడిగినవారికి లేదనని పెద్ద చేయి తల్లి నీది..’ వరుసగా అన్నీ మంచి లక్షణాలే. మా స్నేహితురాలి ముఖం వెలిగిపోతోంది ఆ మాటలకు. ‘అయినవాళ్ల చెడుసూపు నీ మీద ఉంది. జాగ్రత్తగా ఉండాలి..’ మా స్నేహితురాలి ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెంటనే ‘ఈ శ్రావణమాసంలో ఇల్లు కడతావు తల్లీ..’ ఆ మాటతో తన ముఖం మతాబులా వెలిగిపోయింది. అతని మాటల అల్లిక ముచ్చటగా ఉంది. కిందటివారం అమ్మవారి దర్శనానికి స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్లినప్పుడు కొండదిగి కిందకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపున కూర్చొని కనిపించారు చిలుకజోస్యం చెప్పేవాళ్లు. సరదాగా చిలుకజోస్యం చెప్పించుకుందామన్నారు. మా మాటలు విన్నారేమో అన్నట్టుగా ‘అమ్మా, రండి మా రాజా (రామచిలుకపేరు) జోస్యం నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అవుతుంది..’ జోస్యం చెప్పే అతను పిలిచాడు. అతని ముందు ఒక ప్లాస్టిక్ సంచి పరిచి, దానిమీద కార్డులు పేర్చి ఉన్నాయి. పక్కన చిలుక పంజరం. వద్దన్నా వినకుండా ఇద్దరూ అక్కడ చేరిపోయారు. ఒక జాతకానికి ముప్పై రూపాయలు అనడంతో మరేమీ ఆలోచించకుండా అతని ముందు మూడు పది నోట్లు పెట్టింది మా ఫ్రెండ్. ‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు. చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన అక్కడక్కడా, అప్పుడప్పుడూ చూసిందే కానీ, అతని మాటలు ఆ ప్రాంతం వారివిగా అనిపించలేదు. ‘ఏ ఊరు మీది..’ అనడంతో సూర్యాపేట. తెలంగాణవాళ్లం’ అన్నాడు. కొంచెం ఆసక్తిగా అనిపించింది. అక్కణ్ణుంచి ఇంతదూరం వచ్చావా? అక్కడ జోస్యం చెప్పించుకునేవారు లేరా! అనడంతో ‘మేం దేశమంతా తిరిగిటోళ్లమమ్మా. బతుకుదెరువుకోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే, మాకు ఓ ప్రాంతం అనేది ఏముంది?’ అన్నాడు. ‘సూర్యాపేటలో సొంత ఇల్లు ఉంది. మా సుట్టాలంతా అక్కడే ఉంటారు. నెలలో పది రోజులు సూర్యాపేటలో మిగిలిన రోజులు ఇక్కడే. ముప్పై ఏళ్లుగా ఇదే పని. ఇంకో నలుగురం కలిసి ఇక్కడే ఓ రూమ్ తీసుకొని ఉంటున్నాం. వాళ్లూ నాలాగే జోస్యం చెప్పుకుంటారు. నాకు ఒక కూతురు, నలుగురు కొడుకులు. ఈ చిలుకజోస్యం చెప్పుకునే వాళ్లను పెద్దోళ్లను చేశా. వాళ్లందరి పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు కూడా! పట్నంలో పనులు చేసుకుంటు బతుకుతున్నరు..’ అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు. ఈ రామచిలుకను ఎక్కణ్ణుంచి తీసుకొస్తారు? అనడంతో ‘మా సుట్టాలలోనే కొంతమంది వీటికి ట్రైయినింగ్ ఇస్తారు. ఆ పని నాకు తెల్వదు. వాళ్ల దగ్గర్నుంచి మా లాంటివాళ్లు వెయ్యి, రెండు వేలకు ఓ రామచిలుకను కొనుక్కుంటాం’ అన్నాడు. ఎంతసేపూ ఈ చిలుకను పంజరంలోనే ఉంచితే ఎలా? అంటూ.. నా మాట పూర్తికాకుండానే ‘సాయంత్రం మా రూమ్‌కి వెళతాం కదా! అక్కడ పెద్ద పంజరంలో మా చిలుకలన్నీ విడిచిపెడతాం. అన్నీ కలిసి ఉంటాయి. పొద్దున్నే ఎవరి చిలుకను వాళ్లు తీసుకుంటాం. ఒక్కొక్కరం ఒక్కోచోటుకి వెళ్లిపోతాం.’ అంటూనే ‘అమ్మా, మీ పేరున ఓ రాగిరేకు, కొన్ని మూలికలు ఇస్తాను. వాటిని కృష్ణలో వదిలేయాలి. మీ మీదున్న చెడు దృష్టి నీళ్లలో కొట్టుకుపోయినట్టు పోతుంది. దానికి ఖర్చు వంద రూపాయలు!’ అన్నాడు. అతను చెప్పిన ఆ వస్తువులేవో తీసుకొని తను కృష్ణానదివైపుగా అడుగులేసింది. మీ జాతకాన్ని మీరు చూసుకుంటారా అని అడిగితే–‘రోజూ వ్యాపారానికి బయల్దేరే ముందే చూసుకుంటాం. ఏముందమ్మా మనం మంచి అనుకుంటే మంచే అవుతుంది. చెడు అనుకుంటే అంతా చెడే’ అన్నాడు అతను బతుకునేర్పిన అనుభవంతో! ‘ఒక్క గింజ కూడా దాచుకోలేని పిట్ట మనిషి భవిష్యత్తును ఏం చెబుతుంది?’ అని ప్రశ్నించే ఓ కవి మాటలు గుర్తుకువచ్చాయి. వ్యాపారం అని అతనే అంత స్పష్టంగా చెప్పాడు. మంచి‘మాట’ను అందుకు ఎంచుకున్నాడు. మంచే జరుగుతుందనే ఆలోచన మైండ్‌లో ఉంది. వ్యాపారంలో ప్రాథమిక సూత్రాలు ఇవే కదా! ఫ్రెండ్ తిరిగి రావడంతో నేనూ తనతో బయల్దేరాను. వెడుతూ వెనక్కి తిరిగి పంజరం వైపు చూశాను. జాతకం చెప్పించుకోవడానికి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ చేరారు. పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక ముక్కుతో కార్డు లాగి, ఆ వెంటనే లోపలికి వెళ్లిపోయింది. – నిర్మలారెడ్డి -
వైభవం.. వీరబ్రహ్మం జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 408వ జయంత్యుత్సవాలు రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి పుట్టిన రోజు కావటంతో వేద పండితులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో మఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు సతీసమేతంగా.. పార్కులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి బయలుదేరారు. 101 మంది మహిళలు కలశాలతో అక్కడికి మేళతాళాలతో కలిసి వెళ్లారు. వేది పండితులు వేద మంత్రాలు పఠించగా మఠాధిపతులు విగ్రహమూర్తికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం.. వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబకు ఆలయ అర్చకులు కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మఠా«ధిపతుల దంపతులు, స్థానిక మఠం మేనేజరు ఈశ్వరాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రచారం లేక తగ్గిన భక్తులు: మహోత్సవాలకు ఏటా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు పాల్గొనే వారు. ఈ ఏడాది కేవలం మండల భక్తులతోపాటు కొన్ని ప్రాంతాల నుంచి విశ్వబ్రాహ్మణులు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఇందుకు కారణం దేవస్థాన నిర్వాహకులు సరిగా ప్రచారం చేయకపోవటం వల్లనే అని భక్తులు ఆరోపిస్తున్నారు. గోడపత్రాలు, పత్రికల ప్రకటనలు, ఇతర జిల్లాల ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో గడిపేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నా ప్రచారం లేకపోవటం వలనే భక్తుల సంఖ్య తగ్గిందని స్థానికులతోపాటు వ్యాపారులు పేర్కొన్నారు. -
సౌరబలం: ఆగస్టు 25 నుండి 31 వరకు
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20) ఉద్యోగయత్నాలు సానుకూలం. పనుల్లో పురోగతి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు తథ్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం. వారం చివరిలో ధనవ్యయం. దూరప్రయాణాలు. వృషభం (ఏప్రిల్ 21-మే 20) పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. మిథునం (మే 21-జూన్ 21) కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కర్కాటకం (జూన్ 22-జూలై 23) అనుకోని ప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నిర్ణయాలలో తొందర వద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. సింహం (జూలై 24-ఆగస్టు 23) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. అనుకున్నది సాధించేవరకూ విశ్రమించరు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. రచయితలు, కళాకారులకు సన్మానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23) పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బంది పెట్టినా అవసరాలు తీరతాయి. బంధువులు, శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22) సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21) పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శుభకార్యాలకు హాజరవుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలో చికాకులు. ఆరోగ్యభంగం. మకరం (డిసెంబర్ 22-జనవరి 20) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకున్న పనులు కొంత మందగిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆరోగ్యభంగం. తీర్థయాత్రలు చేస్తారు. మిత్రుల నుంచి కొద్దిపాటి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19) ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. మీ ప్రతిపాదనలకు కుటుంబసభ్యులు వ్యతిరేకత చూపుతారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. పనులు పూర్తి. మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20) పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... ఇంతకాలం వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారమవుతుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. రావలసిన పైకం అందుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. అపవాదులు తొలగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు కలిగినా సర్దుబాటు కాగలవు. కళాకారులు, పరిశోధకులకు విశేష యోగకాలమే. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... నాగార్జున పుట్టినరోజు: ఆగస్టు 29