విమ్స్‌పై విశాఖ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను నిర్వహించలేం.. ప్రైవేట్‌కు ఇస్తే బ్రహ్మాండంగా నడపవచ్చంటూ ముఖ్యమంత్రికి వివరించి దీన్ని ఏకంగా లాక్కోవాలని చూశారు. ఇలా చేసింది ఎవరో కాదు స్వయానా విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి. వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదాలు ఇస్తున్న నేపథ్యంలో విమ్స్‌నూ తీసేసుకుందామని ఆయన ప్రయత్నించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విమ్స్‌ను ఇప్పటికిప్పుడు 9 స్పెషాలిటీలతో, 5 సూపర్ స్పెషాలిటీలతో నడిపించాలంటే రూ.200 కోట్లు పైగా అవసరమవుతుందని, దీన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తే మెరుగైన సేవలు అందుతాయనేది సదరు మంత్రి సూచన. దీంతో చకచకా పావులు కదిపారు. గీతం వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా ఇచ్చినట్టే విమ్స్‌ను మంత్రి బంధువు ఒకరు తీసుకుని, దానికి కూడా డీమ్డ్ హోదా తీసుకోవాలని తీవ్రంగా యత్నించినట్టు తెలిసింది. సీఎంతో దీనిపై పలు దఫాల్లో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. లోపాయికారిగా జరుగుతున్న ఈ ప్రతిపాదన వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారుల చెవిన పడింది. అప్పటి వరకూ అది ‘నిమ్స్’ లాగే అటానమస్ హోదాలో ఉండేది.
ఇలా అటానమస్ హోదాలో ఉంటే ప్రభుత్వం సులభంగా ప్రైవే ట్‌కు కట్టబెడుతుందేమోనని భావించిన అధికారులు... డిసెంబర్ మొదటి వారంలో విమ్స్‌ను వైద్య విద్యాశాఖలో కలిపేస్తూ జీవో జారీచేశారు. దీంతో రాజకీయ నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. అయినా మంత్రి పట్టు వదలలేదు. ఇప్పటికీ విమ్స్‌ను ప్రభుత్వం నడపడం సాధ్యం కాదని, దీన్ని ప్రైవేట్‌కు ఇవ్వడమే మేలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విమ్స్ పనులు తీవ్ర జాప్యంతో నడుస్తుండటాన్ని బట్టి అనుమానాలు కలుగుతున్నాయి.