
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ డ్రాప్స్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. ఎథిక్స్ కమిటీ అనుమతుల మేరకు విమ్స్‌లో మొదలు పెట్టామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇంట్రా మస్క్యులర్ ఇంజక్షన్ రూపంలో మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని చెప్పారు. అలా కాకుండా పోలియో డ్రాప్స్ తరహాలో ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిందన్నారు.
ఇంజక్షన్ టీకా కంటే డ్రాప్స్ టీకా వల్ల వచ్చే యాంటీబాడీస్ సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు మొదటి, రెండు ట్రయల్ రన్స్‌లో తేలిందని చెప్పారు. ట్రయల్ రన్‌లో భాగంగా 18 ఏళ్లు దాటిన 3,160 మందికి టీకా వేయనున్నట్టు తెలిపారు. ఇంజక్షన్ టీకా తరహాలోనే మొదటి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తామన్నారు. ఇంజక్షన్‌గా వేసే టీకా ద్వారా ఒక రకమైన రక్షణ ఉంటే.. ముక్కులో వేసే డ్రాప్స్ టీకా ద్వారా రెండురకాల రక్షణ ఉంటుందని చెప్పారు.
చదవండి: (డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం)
ఇంజక్షన్ టీకాతో సిస్టమిక్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుందని, డ్రాప్స్ టీకా వల్ల సిస్టమిక్‌తో పాటు, మ్యూకోజల్ ఇమ్యూనిటీ లభిస్తుందని ఆయన తెలిపారు. మూడోదశ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్ పి.విజయకుమార్, సహాయకులుగా డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ షాఫినా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment