క్యాంపస్ సెలక్షన్స్‌లో శ్రీవిష్ణు విద్యార్థులు 502 మంది ఎంపిక
భీమవరం:
భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాల్గవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు వివిధ బహుళ జాతీయ సంస్థలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్యూల్లో 502 మందికిపైగా ఎంపిక కావడంతో కళాశాలలో శనివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గత మూణెళ్లుగా రాత, ఆన్‌లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, సాంకేతిక, మానసిక పరీక్షల అనంతరం అర్హులైన విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ఐబిఎం సంస్థకు 179 మంది, క్యాప్ జెమినీ 167, ఇన్ఫోసిస్ 54, టెక్ మహీంద్రా 82, జాన్‌డీర్ 7, కోని ల్యాబ్స్ 6, టాలెంట్ స్ప్రింట్ 3, థర్మాక్స్ 2, ఎన్‌టిటి డేటా ఇరువురు ఉగ్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్ ఇంటర్యూల శిక్షణా బందంతో కలిసి భారీ కేక్ కట్ చేసి విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటి చైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికైన వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు కావడం అభినందనీయమని విద్య పట్ల గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలకు అమితాసక్తి కనబరుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపిక కావడం పట్ల తమ మనోభావాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటి వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ జి.సుబ్బరాజు పాల్గొన్నారు.