రవీంద్రుడు గొప్ప తత్వవేత్త | viswakavi ravindranath tagore | Sakshi
Sakshi News home page

రవీంద్రుడు గొప్ప తత్వవేత్త

Published Sat, Jan 28 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

viswakavi ravindranath tagore

  • ఎందరికో స్ఫూర్తి ప్రదాత
  • ‘విశ్వకవి’ పదానికి నిజమైన అర్థం
  • ప్రముఖ సాహితీవేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు
  • రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : 
    విశ్వకవి రవీంద్రనా«థ్‌ ఠాగూర్‌ గొప్ప తత్వవేత్తని ప్రముఖ సాహితీవేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. ఆయన రచనల్లో భాషా భేదం లేకుండా ఎందరో కవులను ప్రభావితం చేస్తూ ‘విశ్వకవి’ పదానికి నిజమైన అర్థంగా నిలిచారని కొనియాడారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏపీ ఉన్నత విద్యా మండలి, ఎన్టీఆర్‌ ట్రస్టుల సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. తాను 13వ ఏట నుంచే కథలు రాయడం ప్రారంభించానని గొల్లపూడి చెబుతూ తన రచనలపై రవీంద్రుని ప్రభావం ఏ విధంగా పడిందో తెలియజేశారు. చిన్న వయస్సు కావడంతో కొత్త కథలు రాయడానికి సరైన అంశం దొరికేది కాదన్నారు. ఈ తరుణంలో రవీంద్రుని రచనలతో పరిచయం ఏర్పడి, రచనలు చేసేందుకు సబ్జెక్టు కోసం వెదుకులాడవలసిన పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ విధంగా ఆయన రచనల ప్రభావం ఏపీలోనే కాకుండా విశ్వమంతా వ్యాపించిం దని తెలిపారు. వాస్తవికతకు అద్దం పట్టే విధంగా ఆయన రచనలు ఉంటాయన్నారు. ఏన్నో రచనల ద్వారా ఎందరికో చైతన్యదీప్తిగా నిలిచిన ఆయనకు 52వ ఏట వచ్చిన ‘నోబుల్‌ బహుమతి’తోనే గుర్తింపు వచ్చిందన్నారు. అప్పటి వరకూ బెంగాల్‌లో ఆయనను, ఆయన రచనలను తిట్టని వారు లేరన్నారు. మన ఇంట్లో వారి గొప్పతనం మనకు తెలియదు, పొరుగు వారు పొగిడినప్పుడే అన్నట్టు ఆసియాలో నోబుల్‌ బహుమతి అందుకున్న తొలి రచయితగా గుర్తింపు వచ్చిన తరువాతే రవీంద్రుడిని, ఆయన రచనలను జగమంతా గుర్తించిందన్నారు. చలం, కృష్ణశాస్త్రి వంటి రచయితలు కూడా ఆయనను అనుసరించేవారని తెలిపారు.  
    నేనింకా పేషెంట్‌నే!
    జాతీయ సదస్సుగా నిర్వహిస్తున్న ఇక్కడ చిన్న పొరబాటు జరిగిందంటూ గొల్లపూడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ఆహ్వాన పత్రం, బ్యానర్లలో తన పేరుకు ముందు డాక్టర్‌ అని పెట్టారు కానీ, నేను ఇంకా పేషెంట్‌నే’ నంటూ చమత్కరించి, నవ్వించారు. తెలుగు సాహిత్యంపై రవీంద్రుని రచనల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ముఖ్యఅతిథి నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రుడు రచించి, స్వయంగా ఆలపించిన జాతీయ గీతం వీడియోను     ప్రదర్శించారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.ఎస్‌.రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బెనారస్‌ హిందూ యూనివర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు జోశ్యుల సూర్యప్రకాశరావును ఘనంగా సన్మానించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ. నరసింహారావు, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు సి.మృణాళిని, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, డీ¯ŒS ఆచార్య ఎస్‌.టేకి, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ కె.వి.ఎ¯ŒS.డి.వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    పద్యాలు చదవడం వల్లే రచయితనయ్యా :  గొల్లపూడి  
    రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
    ‘చిన్నతనంలో పద్యాలు చదవమని నా తల్లి చెబుతూ ఉండేది, నేను అలాగే చేసేవాడిని, అందుకనే 13వ ఏటే రచయితను కాగలిగాను’ అని ప్రముఖ సాహితీవేత్త, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీకి వచ్చిన ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేడు పాఠశాలల్లో విద్యార్థులకు పద్యాలు గురించి చెప్పడం మానేసి, ఆంగ్ల భాష రుద్దుడు కార్యక్రమం ఎక్కువగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలుగు పద్యం పదికాలాల పాటు గుర్తుండిపోతుందని, పద్యం ద్వారానే భాష మాధుర్యం తెలుస్తుందన్నారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని, ఆ మాధుర్యాన్ని పిల్లలకు బాల్యం నుంచే అందించవలసిన అవసరం ఉందన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ... చిరుప్రాయం నుంచి తెలుగు భాషను అభ్యసన చేయడం వల్ల వారి హృదయాలలో అది చెరగని ముద్రగా నిలిచిపోతుందన్నారు.  ప్రస్తుతం  తెలుగు మీడియం లేకుండా చేసే పరిస్థితులు తలెత్తాయంటూ  గొల్లపూడి ఆవేదన చెందారు.     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement