
పద్ధతి గల జీవితానికి లయ ఉంటుంది. లక్ష్యం ఉంటుంది. ఆ లయ, లక్ష్యం పైకి కనిపించకపోవచ్చు. కానీ మనిషిని చూసి చెప్పేయొచ్చు. ఆఫీస్ టైమ్ అయిపోతోందనీ, మీటింగ్ టైమ్ మించిపోతోందని పద్ధతిగల మనుషులు ఎప్పుడూ పరుగులు తీయరు. సరిగ్గా సమయానికో, సమయం కన్నా ముందుగానో సిద్ధంగా ఉంటారు. సంస్థ నియమ నిబంధనలకు బద్ధులై ఉంటారు. వ్యక్తిగతంగా కూడా కొన్ని నియంత్రణలను ఏర్పరచుకుంటారు. ఇలాంటివారు వాయిదాలు అడగరు. వాదనలు పెట్టుకోరు. ఒక పని ఫలానా సమయానికి పూర్తవ్వాలని ఆదేశాలొస్తే, లేదా తమకై తాము అనుకుంటే ఆరు నూరైనా ఆ సమయానికి పని పూర్తి చేసేస్తారు. అది ఏ పనైనా, ఎంతటి పనైనా అంతే. ఉదా: ‘జన గణ మన’ గీతాన్ని పాడడం సరిగ్గా 52 సెకన్లలో పూర్తి చేయాలన్నది చట్టంలోని ఒక నియమం. ‘ఆ.. ఆలోపే పాడేస్తే ఏముందిలే, యాభై రెండు సెకన్లు దాటితే ఏమౌతుందిలే’ అని పద్ధతి, క్రమశిక్షణ ఉన్నవారు అనుకోరు. కచ్చితంగా యాభై రెండు సెకన్లకు జన గణ మన పూర్తయ్యేలా సాధన చేస్తారు.
సాధన మానవ జీవితాన్ని లయబద్ధం చేస్తుంది. లక్ష్యాన్ని ఏర్పరచి ముందుకు నడిపిస్తుంది. దైవ సన్నిధికి మనసు చేర్చడానికి కూడా ఇదే విధమైన సాధన అవసరం. ‘జన గణ మన’ ప్రస్తావన ఎటూ వచ్చింది కనుక ఒక చిన్న విషయం. 1911లో ఇదే రోజు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో జన గణ మన గీతాన్ని తొలిసారిగా ఆలపించారు. రాసింది ఎవరో తెలుసు కదా. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్. ఆయన డిసెంబర్ 11న గీత రచన చేస్తే, డిసెంబర్ 27న ఆ రచన.. పాట రూపం దాల్చింది.
Comments
Please login to add a commentAdd a comment