రైతు ద్రోహి చంద్రబాబు
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ ఎండిపోయిన విషయం తనకు తెలీదని అసమర్థ ముఖ్యమంత్రిగా అంగీకరించిన చంద్రబాబు వారం రోజులు తిరక్కుండానే పంటను రక్షించి కరువును జయించినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు శనివారం కూడేరు, ఆత్మకూరు మండలాల్లో పంట పొలాలకు వెళ్లి వేరుశనగ స్థితిగతులను తెలుసుకున్నారు.
మొదట కూడేరు మండలం ముద్దలాపురంలో రైతు మల్లికార్జునరెడ్డికి చెందిన వేరుశనగ పొలాన్ని చూశారు. 75 రోజులవుతున్నా రెండు, మూడు ఊడలు కూడా లేవని రైతు వాపోయాడు. అనంతరం ఆత్మకూరుకు చెందిన రైతు విశ్వనాథరెడ్డి పొలాన్ని చూశారు. రోగాలతో సగం వేరుశనగ ఎండిపోగా, మిగతా సగం ఒకట్రెండు ఊడలు మాత్రమే దిగడాన్ని చూశారు. ఎకరాకు రూ.18 నుంచి రూ.20 వేల దాకా ఖర్చు చేశామని, ఆదుకోవాలని పలువురు రైతులు ఈ సందర్భంగా నేతలకు విన్నవించారు. పంట పరిశీలన తర్వాత ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పుష్కరాల్లో మునిగితేలిన చంద్రబాబుకు జిల్లాలో ఎండిపోయిన పంటలు, కరువు పరిస్థితులు కనిపించకపోవడం దారుణమన్నారు.
హైటెక్ సీఎంగా చెప్పుకుంటున్న వ్యక్తి పంటలు ఎండిపోయిన విషయాన్ని తెలుసుకోలేకపోవడం, ఆ నెపాన్ని మంత్రులు, అధికారులు, మీడియాపై వేయడం శోచనీయమన్నారు. జిల్లా పర్యటన ముగించుకున్న తర్వాత రైతులకు భరోసా ఇస్తారని ఆశిస్తే..అందుకు విరుద్ధంగా ప్రకటన చేశారన్నారు. వచ్చే పరిహారం కూడా రాకుండా చేసేలా రెయిన్‌గన్ల ద్వారా నాలుగురోజుల్లోనే పంటను కాపాడినట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వంపై ఆధారపడవద్దని రైతులకు పరోక్షంగా సంకేతాలిచ్చారన్నారు. ఫసల్‌బీమాను వర్తింపజేయడంలోనూ దారుణంగా విఫలమయ్యారన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... నీళ్లు లేకున్నా రక్షకతడుల పేరుతో నాలుగు రోజుల పాటు సినిమా షూటింగ్‌లా హడావిడి చేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు.
సీఎంలా కాకుండా కనికట్టు మాంత్రికుడిగా బోగస్ లెక్కలతో రైతులను బురిడీ కొట్టించారని మండిపడ్డారు. జిల్లాలో వేరుశనగ పంట నిలువుగా ఎండిపోయిందని, ఎకరాకు రెండు బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించారు. ఈ విషయం తెలిసీ రెయిన్‌గన్ల ద్వారా హడావుడి∙చేయడం ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రాకుండా ఎగ్గొట్టడానికేనన్నారు. బీమా నిబంధనల ప్రకారం రెండో దశ కింద తప్పనిసరిగా పరిహారం రావాల్సి ఉంటుందన్నారు. అయితే రక్షకతడి మాటున పరిహారం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తోపుదుర్తి భాస్కరరెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేవు, కుంటలు, చెక్‌డ్యాంలలో నీళ్లు కూడా లేవు, కానీ రెయిన్‌గన్ల ద్వారా పంటను కాపాడినట్లు గొప్పలు చెబుతూ రైతులను వంచనకు గురిచేశారని మండిపడ్డారు.
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ పంట ఎండిపోయింది, పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిసీ రెయిన్‌గన్లతో డ్రామా నడిపారని విమర్శించారు. వర్షం రావడంతో పంట కాస్తంత పచ్చదనం సంతరించుకున్నా దిగుబడుల పరంగా ఏమీ లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏమి చేసినా రైతును జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, ప్రభుత్వం ఆదుకోకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని నేతలు హెచ్చరించారు. ముందుగా డబ్బు కడితే తర్వాత అకౌంట్లలో జమ చేస్తామంటూ మభ్యపెట్టి చివరకు ఒక్క రెయిన్‌గన్ కూడా ఇవ్వలేదని రైతులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. పంట పరిశీలనలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు సీపీ వీరన్న, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, మామిళ్లపల్లి అమరనాథరెడ్డి, కూడేరు జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ మధుసూదన్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.