ఫలితం లేని ‘జన్మభూమి’ ఎందుకు?
– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
వజ్రకరూరు : ప్రజాసమస్యలు పరిష్కారం కానప్పుడు ‘జన్మభూమి’ కార్యక్రమం ఎందుకని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మండలంలోని కమలపాడులో సర్పంచు యోగానంద అధ్యక్షతన ‘జన్మభూమి – మాఊరు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు విడతల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు ఇచ్చిన వినతులే పరిష్కారానికి నోచుకోలేదు..తిరిగి నాల్గో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇల్లూ నిర్మించలేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మించినట్లు తెలిపారు.
ప్రజలు కరువుకాటకాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ‘అంతా డిజిటల్ మయం’ అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జన్మభూమి -మాఊరు సభల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచు యోగానంద, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు కమలపాడు వెంకటరెడ్డి, మన్యంప్రకాష్, నారాయణరెడ్డి, మండలనా యకులు శివరామిరెడ్డి, ఉస్మాన్, రాజగో పాల్, కూర్మన్న, మాబుపీరా, సుంకన్న, రామాంజనేయులు , మనోహర్, పీరా, పూజారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.