సాగర్ జలాల కోసం ఎదురుచూపు
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు :
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సాగర్ జలాలను విడుదల చేసి పంటలను కాపాడాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూలై నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలోని రైతులు వరి, పత్తి, మిరప, టమోటా తదితర పంటలు సాగుచేశారన్నారు. 50 రోజులుగా చినుకు జాడే లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. పది రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయని, దీంతో బోర్ల నుంచి సాగునీరు అందించినా ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే వాటిని ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. జిల్లాకు జలవనరుల శాఖ మంత్రి ఉన్నందున ఇప్పటికైనా తెలంగాణ మంత్రులతో మాట్లాడి మూడో జోన్‌కు సాగర్ జలాలను రప్పించి చెరువులన్నింటినీ నింపాలని కోరారు.