టీబి డ్యాం నీటి కోసం ఎదురుచూస్తున్న పల్లెవాసులు
టీబి డ్యాం నీటి కోసం ఎదురుచూస్తున్న పల్లెవాసులు
Published Tue, Jul 19 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
– ఆదోనిలో తీవ్రమైన తాగు నీటి ఇబ్బందులు
– పక్షం రోజుల్లోనే 37 టీయంసీలు చేరిక
కర్నూలు సిటీ: జిల్లాలో నెలన్నర రోజులుగా అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కుంటలు, చెరువుల్లో నీటి నిల్వలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత పల్లెల్లో తాగు నీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నీటి పథకాల ట్యాంకుల్లోని నీటి నిల్వలు అడుగంటిపోయాయి. పశ్చిమ పల్లె వాసుల దాహాం తీర్చే ప్రధాన జలసిరి ఎల్‌ఎల్‌సీ కాల్వ. తుంగభద్ర జలాశయంలో నీరు లేకపోవడంతో దాదాపు మూడు నెలల నుంచి కాల్వలకు నీటి విడుదల ఆగిపోయింది. ఈ కాల్వ నీటిపై 17 రక్షిత తాగు నీటి పథకాలు 165 గ్రామాల ప్రజల తాగు నీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అధికారులేమె వర్షాలు వచ్చాయి..తాగు నీటి ఇబ్బందులు లేవని అంటున్నారు. తాగు నీటి అవసరాలను దష్టిలో పెట్టుకొని ఎల్‌ఎల్‌సీకి టీబి డ్యాం నుంచి నీరు విడుదల చేయాలని జల వనరుల శాఖ ఇంజనీర్లకు వినతులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాం. పక్షం రోజులుగా కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల సుమారు 37 టీయంసీల నీరు డ్యాంలోకి చేరడం గమనర్హం. భారీగా వరద నీరు చేరుతుండడంతో జిల్లా దిగువ కాల్వ(ఎల్‌ఎల్‌సీ) ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. దీంతో మొదటగా తాగు నీటి అవసరాల కోసం కాల్వకు నీరు ఇవ్వాలని జల వనరుల శాఖ ఇంజనీర్లు బోర్డును కోరనున్నారు. ఇండెంట్‌లో పెట్టేందుకు ఇటీవలే జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్‌కు నోట్ పెట్టారు. ఇండెంట్ పెట్టేందుకు అనుమతులు ఇస్తే రెండు, మూడు రోజుల్లో ఇండెంట్ పెట్టే అవకాశం ఉంది.
తుంగా జలాల కోసం ఆశగా..
కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని శివమొగ్గ, ఆగుంటె, చిక్కమగళూరు, మొరాళ, తీర్థహళ్ళి, మందగడ్డె ప్రాంతాల్లో 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పక్షం రోజుల్లోనే డ్యాంలోకి సుమారు 37 టీ.యం.సీల నీరు వచ్చి చేరినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో సుమారు 40 టీయంసీకు చేరింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా ఆదోని మున్సిపాలిటిలో తీవ్రమై తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని వినతులు రావడంతో జల వనరుల శాఖ ఇంజనీర్లు ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్‌కు నోట్ పెట్టారు. డ్యాం నుంచి నీరు విడుదల చేయాలంటే కర్ణాటక ఇండెంట్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టాలి. కర్ణాటక ప్రస్తుతం కూడ బళ్ళారి ప్రాంతాల్లో నెలకొన్న తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ నెల 21వ తేదినే ఇండెంట్ పెట్టనున్నటు తెలిసింది. గతేడాది కూడ ఇదే సమయంలోనే ఇండెంట్ పెట్టారు. గతేడాది జూలై 25 నాటీకి ఎల్‌ఎల్‌సీ కాల్వ ఏపీ సరిహద్దుకు నీరు చేరినట్లు అ«ధికార వర్గాలు చెబుతున్నాయి.
కలెక్టర్‌కు నోట్ పెట్టాం
టీబి డ్యాంకు భారీగానే వరద నీరు వస్తుంది. జిల్లాలోని పశ్చిమ పల్లెల్లో తాగు నీరు ఇబ్బందులు ఉన్నాయని వినతులు వస్తున్నాయి. ఇటీవలే ఆదోని మున్సిపాలిటీ వారు ఎల్‌ఎల్‌సీ కాల్వకు నీరు విడుదల అయ్యేలా చూడాలని విన్నివించారు. ఈ విషయం కలెక్టర్‌కు నోట్ పెట్టాం. తాగు నీటికి ఇండేంట్ పెట్టుకునేందుకు కలెక్టర్ ఓకే చెబితే కర్ణాటక వారితో కలిసి ఇండేంట్ పెడతాం.
– యస్.చంద్రశేఖర్ రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్
Advertisement
Advertisement