123 జీవో రద్దుతోనైనా కళ్లు తెరవాలి
-
ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు
-
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్: జీవో 123 రద్దుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ద్వారా పరిహారం చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం 123 జీవో ద్వారా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతోనే హైకోర్టు జీవో 123ని రద్దు చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పించాలని చట్టంలో ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి, రాజరిక పాలన తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాజ్టెల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇన్నిసార్లు కోర్టు మందలించిన దాఖలు లేవని, కోర్టు తీర్పు చెంపపెట్టు కావాలన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు.