తహసీల్దార్ నియామకాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే పితాని
తహసీల్దార్ నియామకాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే పితాని
Published Tue, Nov 22 2016 6:27 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టర్, పితాని మధ్య విభేదాలే అడ్డు
భీమవరం:
ఉద్యోగుల నియామకం విషయంలో అధికారపార్టీ నాయకుల జోక్యం ఎక్కువ కావడమేగాక నిబంధనలకు విరుద్దమైనా తాము చెప్పిందే చేయాలంటూ అధికారులపై ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాము చెప్పిన మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తామనే ధోరణిలో కొంతమంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఉద్యోగులపై చేయి చేసుకున్న సంఘటనలు లేకపోలేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారపార్టీ ఎమ్మెల్యే కంటే జిల్లా కలెక్టర్‌కే అధికప్రాధాన్యత ఇస్తున్నారని దానితో గ్రామాల్లో తాము చెప్పిన పనులు జరగగక ప్రజల్లో పరువుపోతుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బహిరంగంగా ప్రకటించిన విషయం విధితమే. దీనితో కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్యే పితాని మధ్య పొరపొచ్చలు వచ్చాయనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలు మర్చిపోకముందే పోడూరు తహసీల్దార్ నియామక వ్యవహారం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మధ్య మరొక వివాదానికి దారితీసింది. ఆగస్టు నెలాఖరున భీమవరం తహసీల్దార్ గంధం చెన్నుశేషు, పెనుగొండ తహసీల్దార్ వీఎస్‌ఎస్ బ్రహ్మానందం పదవి విరమణ చేశారు. సుమారు రెండు మండలాల్లోను ఇన్‌చార్జ్ తహసీల్దార్లే పాలన సాగించారు. అయితే ఈ¯ð ల 14వ తేది రాత్రి జిల్లాలోని నలుగురు తహసీల్దార్స్‌ను కొత్తగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమయంలో భీమవరం తహసీల్దార్‌గా చవ్వాకుల ప్రసాద్, పోడూరు తహసీల్దార్‌గా కొవ్వూరు కే ఆర్‌ఆర్‌సీలో పనిచేస్తున్న కే శ్రీరమణి, పోడూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న వి స్వామినాయుడును యలమంచిలి బదిలీచేస్తూ యలమంచిలి తహసీల్దార్ పనిచేస్తున్న సిహెచ్ గురుప్రసాదరావును హైదరాబాద్ సర్వే అండ్ జాయింట్ సెటిల్‌మెంట్‌శాఖకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.దీనితో భీమవరం, యలమంచిలి తహసీల్దార్లు మరుసటి రోజునే భాద్యతలు స్వీకరించారు. అయితే పోడూరు తహసీల్దార్ కె శ్రీరమణి జాయినింగ్‌కు ఆటంకం ఏర్పడింది. అక్కడి శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని తహసీల్దార్‌ను ఎలా నియమిస్తారంటూ అడ్డు చెప్పడంతో శ్రీరమణి బాధ్యతలు స్వీకరించనేలేదు.
వివాదానికి కారణంగా ఇదీ.....
ఎమ్మెల్యే పితాని, కలెక్టర్ భాస్కర్ మధ్య పొరపొచ్చలు ఉన్న నేపద్యంలో గత ఆగస్టు 31న పెనుగొండ తహసీల్దార్ వీఎస్‌ఎస్ బ్రహ్మనందం పదవీ విరమణ చేశారు. అక్కడ వేరొక తహసీల్దార్‌ను నియమించడానికి వ్యక్తిని సిపార్సు చేయాల్సిందిగా నరసాపురం సబ్‌కలెక్టర్ పితాని కోరడంతో మీకు నచ్చినవారిని బాగా పనిచేసినవ్యక్తిని నియమించాల్సిందిగా సూచించారు. అయితే మీరే వ్యక్తిని సిపార్సుచేయాలంటూ ఆయనపై రెవెన్యూ అధికారులు వత్తిడి తేవడంతో ఎమ్మెల్యే పితాని బొడ్డు శ్రీనివాసరావు పేరును సిపార్సు చేశారు. అయితే పితాని అభిప్రాయానికి భిన్నంగా పెనుగొండ తహసీల్దార్‌గా అప్పట్లో మావూరి రాజశేఖర్‌ను నియమించి శ్రీనివాసరావు కుక్కునూరు తహసీల్దార్‌గా నియమించారు. దీనితో తీవ్రం ఆగ్రహారానికి గురైన∙పితాని తాను సిపార్సు చేసిన వ్యక్తికి తాను చెప్పినచోట పోస్టింగ్ ఇవ్వకపోగా పనిస్మింట్‌గా కుక్కునూరు వేస్తారంటూ ఈ వ్యవహారంపై సీఎంవోలో రెవెన్యూశాఖ వ్యవహారాలు చూసే సతీష్‌చంద్రకు పిర్యాదు చేశారు. దీనితో పెనుగొండ తహసీల్దార్‌గా నియమించిన మావూరి రాజశేఖర్‌ను రెండురోజుల్లోనే అక్కడి నుంచి బదిలీ చేసి ఆయన స్ధానంలో పితాని సిపార్సుచేసిన బ్రహ్మానందం నియమితులయ్యారు. అయినప్పటికీ పితాని కలెక్టర్ భాస్కర్ వ్యవహారం పట్ల గుర్రుగా ఉన్నారు. ఈ నేపద్యంలోనే పోడూరు తహసీల్దార్ స్వామినాయుడు బదిలీ కావడం ఆయన స్ధానంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి బంధువు శ్రీరమణిని ఎమ్మెల్యే పితాని ప్రమేయం లేకుండా నియామకం చేశారు. అయితే తనకు మాట మాత్రమైన చెప్పకుండా ప్రధానమైన అధికారిని ఎలా నియమిస్తారంటూ పితాని కోపోద్రికుడై శ్రీరమణి నియామకాన్ని అడ్డుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే పితాని కలెక్టర్‌తో విభేదాలు కారణంగానే శ్రీరమణికి అడ్డుచెబుతున్నట్లు రెవెన్యు వర్గాలు చెబుతున్నా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాస్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి ఎమ్మెల్యే పితానికి అంతర్గత విబేధాలున్నాయని దానివల్లనే తోట బందువైన శ్రీరమణి నియామకాన్ని అడ్డుకున్నారని కొంతమంది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అధికారుల నియమాకంలో టీడీపీ నాయకుల పెత్తనానికి పోడూరు తహసీల్దార్ నియామకం నిదర్శనంగా నిలుస్తోంది.
Advertisement