ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం | war for love | Sakshi
Sakshi News home page

ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం

Published Thu, Mar 30 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం

ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం

- కైరుప్పలలో ఉత్కంఠ భరిత పోరు
- 40 మందికి స్వల్పగాయాలు
- భారీగా తరలివచ్చిన భక్తజనం
 
ఆస్పరి/ఆలూరు/ఆలూరు రూరల్‌: ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం..కైరుప్పల గ్రామ ప్రత్యేకం. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఈ పోరు హోరాహోరీగా సాగింది.  సమరంలో 40 మంది స్వల్పంగా గాయపడ్డారు. గ్రామస్తులంతా రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో తలపడటం, ఆ తరువాత అంతా కలసిపోవడం విశేషం. పిడకల సమరాన్ని చూడటానికి జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాలే  రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో దాడి చేసుకోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు.
 
ప్రతి యేటా పిడకల సమరానికి ముందు.. కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తులు కైరుప్పలకు గుర్రంపై వచ్చే వారు. అయితే ఈ ఏడాది పెద్దరెడ్డి వంశస్తులకు అంటు ఉన్నందున వీరభద్రస్వామి చిత్రపటాన్ని  గుర్రంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామికి పూజలు చేసిన అనంతరం గుర్రం వెను తిరగగానే పిడకల సమరం మొదలైయింది. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి.. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. కుప్పగాపోసిన పిడకలు అయిపోయేంత వరకు  పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు అంటించుకుని వెళ్లారు. ఉత్సవాలలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మల్లికార్జున,  కార్య నిర్వహణ అధికారి రాంప్రసాద్, సర్పంచ్‌ శరవన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
 
తరలి వచ్చిన జనం..
కైరుప్పలలో పిడకల సమరం తిలకించేందుకు గురువారం ప్రజలు.. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లలో తరలి వచ్చారు. భారీగా తరలి వచ్చిన వాహనాలతో ఎమ్మిగనూరు- పత్తికొండ ప్రధాన రహదారి కిక్కిరిసింది. ఉత్సవం ముగిసిన తరువాత ఆస్పరి, కారుమంచి, బిల్లేకలు, యాటకల్లు, పుప్పాలదొడ్డి, వెంగళాయిదొడ్డి, చెన్నంపల్లి, కలపరి, బైలుపత్తికొండ, ఐనకల్లు, అట్టెకల్లు తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు కిక్కిరిసి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకున్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్‌పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలూరు సీఐ అబ్దుల్‌ గౌష్, ఎస్‌ఐ వెంకటరమణ  బందో బస్తు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement