kiruppala
-
కనుల పండువగా వీరభద్రస్వామి రథోత్సవం
ఆస్పరి : కైరుప్పలలో ఆదివారం సాయంత్రం అశేష జనవాహని మధ్య వీరభద్రస్వామి రథోత్సవం కనుల పండవగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవిలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహలను మేళతాళాల మధ్య ఊరేగించారు. రథం ముందు వేద పండితులు రథాంగ పూజలు నిర్వహించి రథంపై ఉత్సవ విగ్రహలను ఉంచి జయజయ ధ్వానాల మధ్య భక్తులు స్వామి వారి రథాన్ని బసవన్న దేవాలయం దగ్గరకు, అక్కడ నుంచి రథశాల వద్దకు లాగారు. రథోత్సవాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున, సర్పంచ్ శరవన్న , ఎంపీటీసీ రామలింగమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు దత్తాత్రేయరెడ్డి, ఈరన్న, లక్ష్మన్న, రామాంజినేయులు, హనుమంతు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ అబ్దుల్ గౌస్, ఎస్ఐ వెంకటరమణ బందోబస్తు నిర్వహించారు. -
కైరుప్పలలో పిడకల సమరం
-
ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం
- కైరుప్పలలో ఉత్కంఠ భరిత పోరు - 40 మందికి స్వల్పగాయాలు - భారీగా తరలివచ్చిన భక్తజనం ఆస్పరి/ఆలూరు/ఆలూరు రూరల్: ప్రేమను గెలిపించే పిడకల యుద్ధం..కైరుప్పల గ్రామ ప్రత్యేకం. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఈ పోరు హోరాహోరీగా సాగింది. సమరంలో 40 మంది స్వల్పంగా గాయపడ్డారు. గ్రామస్తులంతా రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో తలపడటం, ఆ తరువాత అంతా కలసిపోవడం విశేషం. పిడకల సమరాన్ని చూడటానికి జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాలే రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో దాడి చేసుకోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి యేటా పిడకల సమరానికి ముందు.. కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తులు కైరుప్పలకు గుర్రంపై వచ్చే వారు. అయితే ఈ ఏడాది పెద్దరెడ్డి వంశస్తులకు అంటు ఉన్నందున వీరభద్రస్వామి చిత్రపటాన్ని గుర్రంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామికి పూజలు చేసిన అనంతరం గుర్రం వెను తిరగగానే పిడకల సమరం మొదలైయింది. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి.. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. కుప్పగాపోసిన పిడకలు అయిపోయేంత వరకు పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు అంటించుకుని వెళ్లారు. ఉత్సవాలలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లికార్జున, కార్య నిర్వహణ అధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తరలి వచ్చిన జనం.. కైరుప్పలలో పిడకల సమరం తిలకించేందుకు గురువారం ప్రజలు.. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లలో తరలి వచ్చారు. భారీగా తరలి వచ్చిన వాహనాలతో ఎమ్మిగనూరు- పత్తికొండ ప్రధాన రహదారి కిక్కిరిసింది. ఉత్సవం ముగిసిన తరువాత ఆస్పరి, కారుమంచి, బిల్లేకలు, యాటకల్లు, పుప్పాలదొడ్డి, వెంగళాయిదొడ్డి, చెన్నంపల్లి, కలపరి, బైలుపత్తికొండ, ఐనకల్లు, అట్టెకల్లు తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు కిక్కిరిసి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలూరు సీఐ అబ్దుల్ గౌష్, ఎస్ఐ వెంకటరమణ బందో బస్తు నిర్వహించారు. -
నేడు కైరుప్పలలో పిడకల సమరం
ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కైరుప్పల గ్రామంలో గురువారం సాయంత్రం పిడకల(నుగ్గులు) సమరం జరగనుంది. ఇందు కోసం పిడకలను సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో వీటిని రాశులుగా పోసి ఉంచారు. సమరాన్ని చూడడానికి మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు..వీరభద్రస్వామికి పిడకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.