తారస్థాయికి తమ్ముళ్ల తగాదా | War in the TDP inside | Sakshi
Sakshi News home page

తారస్థాయికి తమ్ముళ్ల తగాదా

Published Tue, Feb 14 2017 10:59 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

తారస్థాయికి తమ్ముళ్ల తగాదా - Sakshi

తారస్థాయికి తమ్ముళ్ల తగాదా

నెల్లూరు(సెంట్రల్‌) : ‘తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు.. ఎవరు దారి తప్పినా ఊరుకునేది లేదు’.. ఈ మాట ఎవరో కాదు, సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు చెబుతున్నవి. అయితే ఆచరణలో ఆయన మాటలు నీటి మూటలు మాత్రమేనని టీడీపీ నేతలు నిరూపిస్తున్నారు.  

కొన్నాళ్లే..
పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత టీడీపీకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన నాలుగు రోజులు మిన్నకున్న నాయకులు, తరువాత పార్టీలోకి వలస వచ్చినవారితో సర్దుబాటు కాలేక గ్రూపు తగాదాలకు దిగారు. టీడీపీలో అంతర్గత పోరు మొదటి నుంచి ఉంది. అయితే ఇది ఇటీవల రోడ్డుకెక్కింది. కొత్త నాయకుల చేరికను పాత నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సయోధ్య కుదరక సమస్యలు వస్తున్నాయి. కొత్తనాయకులు పార్టీలోకి వచ్చే సమయంలో అధిష్టానం నిర్ణయం కావడంతో అయిష్టంగానే పాత నాయకులు ఒప్పుకున్నా రానురాను దూరం పెరిగిపోతోంది.   

నకరాల నెల్లూరు
టీడీపీ నాయకుల మధ్య నెల్లూరు నగర, రూరల్‌ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఆధిపత్య పోరుసాగుతోంది. నగరంపై తామంటే తాము పట్టుసాధించుకోవాలంటూ నగర ఇన్‌ఛార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్‌ అబ్దుల్‌అజీజ్‌లుండగా.. మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్‌రెడ్డి తన ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ పట్టును చూపించుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఇటీవల మేయర్‌ అబ్దుల్‌అజీజ్‌కు, కార్పొరేటర్‌ రంగమయూర్‌రెడ్డికి మధ్య జరిగిన గొడవపై పార్టీలో పెద్ద చర్చే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, తాళ్ళపాక రమేష్‌రెడ్డి మధ్య వివాదం రేగి రోడ్డునపడింది.

అంతకు ముందు మంత్రి నారాయణకు, మేయర్‌ అబ్దుల్‌అజీజ్‌కు మధ్య జరిగిన గొడవలు పార్టీలో పెద్ద ప్రకంపనలే పుట్టించాయి. మరో నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా నగర, రూరల్‌లో తన పెత్తనం ఉండేలా చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా నగరాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఆనం వివేకానందరెడ్డి ప్రస్తుతం మాజీగా మిగిలారు. అధికారం కోసం టీడీపీలో చేరారు. అప్పటి నుంచి తెరవెనుక రాజకీయం మొదలు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి,. ఆనం బ్రదర్స్‌ టీడీపీలోకి వస్తారు అన్నప్పటి నుంచే మేయర్‌ వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరకు అధిష్టానం నిర్ణయం కావడంతో పార్టీలోకి ఆనం బ్రదర్స్‌ రాకను ఎవరూ కాదనలేక పోయారు. కాని ఆనం వివేకా నగరాన్ని, కార్పొరేషన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని తెరచాటు రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మేయర్‌ అజీజ్‌ చేసిన వ్యాఖలే అందుకు నిదర్శనం. గతంలో ఇద్దరు మేయర్‌లను ఏ విధంగా ఇబ్బందిపెట్టారో అందరికీ తెలుసునని, ఇప్పుడు కూడా ఆ విధంగా చేయాలని చూస్తున్నారని అజీజ్‌ చెప్పడం చూస్తుంటే తెర వెనుక ఎటువంటి బాగోతం జరుగుతోందో ఇట్టే అర్థం అవుతోంది.  ప్రధానంగా కార్పొరేషన్‌ సబ్‌ప్లాన్‌ నిధుల విషయంలో ఈ గొడవలు జరుగుతూ వస్తున్నా, అవకాశాన్ని బట్టి ఒకరిపై ఒకరు దూషణకు దిగి రచ్చకెక్కుతున్నారని పార్టీలోని కొందరు చెబుతుండడం గమనార్హం.  

కలహాల కోవూరు
కోవూరు నియోజక వర్గంలో కూడా టీడీపీ వర్గపోరు రంజుగా సాగుతోంది. గత ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం చివరి దాకా ప్రయత్నించిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మధ్య ఆధిపత్యపోరు అంతాఇంతా కాదు. పోలంరెడ్డిని డమ్మీని చేసి ఈసారైనా టికెట్‌ తీసుకుని కోవూరుపై పట్టుసాధించాలని పెళ్లకూరు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లకూరుకు కోవూరు నియోజకవర్గంలో తావు లేకుండా చేయాలని పోలంరెడ్డి పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద వీరిద్దరి గొడవలతో స్థానిక నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళినా చర్యలు తీసుకోకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సూళ్లూరుపేట సలసల
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆధిపత్యపోరు నెల్లూరులో కంటే ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి, మాజీ మంత్రి పరసారత్నం,  వేనాటి రామచంద్రారెడ్డిల మధ్య అంతర్గత పోరు ఉంది. ప్రధానంగా స్థానికంగా టీడీపీలో చక్రం తిప్పుతున్న గంగాప్రసాద్‌తో చాలా మందికి అంతర్గత విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. గంగాప్రసాద్‌ శైలి ఏకపక్షంగా ఉండటంతో మిగిలిన నాయకుల మధ్య జరుగుతున్న వర్గపోరుతో అక్కడ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనే చెప్పాలి.

వెంకటగిరిలో సంకటం
వెంకటగిరి నియోజక వర్గ విషయానికొస్తే స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల వ్యవహార శైలిపై పార్టీలోని ముఖ్యలు కూడా విమర్శలు చేస్తున్నారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద విషయలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుతో కురుగొండ్లపై మరింత వ్యతిరేకత వచ్చి పార్టీలో ఎవరికి వారుగా ఉంటున్నారు.

ఆత్మకూరులో గరంగరం
ఆత్మకూరు నియోజక వర్గంలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గూటూరు కన్నబాబుకు, తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిల మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదు. మొదటి నుంచి ఆనం రాకను కన్నబాబు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అధిష్టానం మాత్రం ఆనం ను పార్టీలో చేర్చుకుని ఆత్మకూరు ఇన్‌చార్జిగిరి కట్టబెట్టారు. దీనిని కన్నబాబు వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఆనం, గూటూరు వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

గూడూరులో గుబులు
గూడూరులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచి అధికార దాహంతో పార్టీ మారిన పాశం సునీల్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జ్యోత్స్నలత, మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌ల మధ్య పోరు కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి పోటీచేసి ఓడిపోయామని, ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని పాత నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో గూడూరులో ఎవరివారు  యమునా తీరే అన్నట్లు  పార్టీ పరిస్థితి  తయారైంది. వచ్చే ఎన్నికల గురించి ఇప్పటినుంచే గుబులు మొదలైంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విబేధాలున్నప్పటికీ అవి ఇంతవరకు బయటపడలేదు.  

అధిష్టానం సీరియస్‌
జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు తగ్గిపోతున్నదని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా గ్రూపు తగాదాలు పెట్టుకుని పార్టీని రోడ్డునపడేసే విధంగా మారడంతో అధిష్టానం వీటిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీలో జరుగుతున్న గొడవల వల్ల క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల వద్దకు చెడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.  పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వద్దకు పంచాయితీలు చేరినా ఆయన స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో అదిష్టానం వద్దకు పంచాయితీలు చేరాయి. దీంతో అధిష్టానం జిల్లా పార్టీ వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బలమైన నాయకులను ఎంతమందిని పార్టీలోకి చేర్చుకున్నా టీడీపీ గ్రాఫ్‌ తగ్గిపోయేటట్లు మారిందని.. ఇక మీదట గ్రూపు తగాదాలు సహించేది లేదని హెచ్చరికలు ఆయా నేతలకు అధిష్టానం సీరియస్‌గా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.   

అందరినీ కలుపుకుపోండి  
టీడీపీలోని అంతర్గత విభేదాలు రోడ్డున పడుతున్నాయని ఇటీవల జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి నారాయణలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు తారస్థాయికి వెళ్ళాయి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు సైతం దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లా టీడీపీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశంలో పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీకి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంపై ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చర్చలు కూడా లేకుండా టిక్కెట్‌ ఏ విధంగా ప్రకటిస్తారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ఇటీవల కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి సైతం మేయర్‌ అజీజ్‌ పై బహిరంగ విమర్శలకు దిగారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మేయర్‌ అజీజ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో  చంద్రబాబునాయుడు ఆనం సోదరులను సోమవారం విజయవాడకు పిలిపించారు. మంత్రి  నారాయణ గంటపాటు చర్చించారు.

పార్టీలో అందరినీ కలుపుపోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆనం సోదరులకు సూచించినట్లు సమాచారం. కాగా, నేడు ఆనం సోదరులు టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement