గతం నాస్తి, అసత్యాలే ఆస్తి
డేట్‌లైన్ హైదరాబాద్
ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేనని కూడా చెప్పారు చంద్రబాబు. అదే నిజమైతే 1982లో ఎన్టీ రామారావు పార్టీ ప్రకటించి, న్యూ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో మీటింగ్ పెట్టి ప్రకటన చేసిన నాటి నుంచి, ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన కొన్ని మాసాల వరకు ఆయన వెంట ఎందుకు కనిపించలేదు? ఎన్టీఆర్‌మీద పోటీ చేస్తానని అనలే దని కూడా చెప్పారు. 1983 ఎన్నికల ముందు పార్టీ నాయకురాలు ఆదేశిస్తే మామ మీద పోటీకి సిద్ధమని చేసిన ప్రకటన కటింగ్‌లు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత శనివారం రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల చివరిరోజున మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. ఆ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్ట్‌లలో ఎంతమంది ఎంతకాలంగా చంద్రబాబునాయుడుగారినీ, ఆయన రాజకీయాలనూ, పరి పాలనా పద్ధతినీ పరిశీలిస్తున్నారో, రిపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఆయన కొన్ని విషయాలలో అలవోకగా అసత్యాలు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇదేమిటి? ఇట్లా జరగలేదు కదా ఆనాడు! అని నిలదీయకపోవడం ఆశ్చర్యం. అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ఉన్న పరిస్థితిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నిర్వహించే సుదీర్ఘ పత్రికా గోష్ఠులలో ఆయన ఉపన్యాసాలు వినాల్సిందే తప్ప, ఎదురు ప్రశ్నించే సాహసం చెయ్యకూడదు. అట్లా చే స్తే ఆయన దబాయించి కూర్చోబెడతారు. ఆయన దృష్టిలో ప్రశ్నించే వాళ్లంతా ఉన్మాదులు, అభివృద్ధి నిరోధకులు, ప్రజా వ్యతిరేకులు. ఈ ధోరణిని అడ్డుకునే సాహసం మీడియాకు లేకుండా పోతు న్నది. దానికి కారణం తెలిసిందే. ఇవాళ మీడియాకూ రాజకీయాలు ఉన్నారు.
చంద్రుడి ఇలాకాలో మర్యాదరామన్నలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీలు వద్దు అంటూ మొన్న శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలూ, ప్రజాసంఘాలూ ఇచ్చిన పిలుపు విజయవంతమైతే ఏలినవారి ప్రాపకంలో ఉన్న పత్రికల్లో సింగిల్ కాలమ్ వార్త కూడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కోరుతూ శాసనసభ రెండుసార్లు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. దానిని ప్రతిపాదించిన ముఖ్యమంత్రే కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే, శాసనసభ ఇంకో ఆరు గంటల్లో సమావేశం అవుతుందనగా అర్ధరాత్రి పత్రికా గోష్ఠి నిర్వహించి హర్షం ప్రకటిస్తారు.
ఒక్క ఆరుగంటలు ఆగి శాసనసభ ముందుకు కేంద్రం ప్యాకేజీ ప్రతిపాదన తెచ్చి మన తీర్మానాలకు కేంద్రం స్పందన ఇదీ అని చెప్పాల్సిన బాధ్యతను ఆయన పట్టించుకోలేదు. శాసనవ్యవస్థల పట్ల చంద్ర బాబునాయుడుకీ, ఆయన పార్టీ వారికీ ఉన్న గౌరవం ఎంతటిదో చాలాసార్లు రుజువైంది. మొన్నటికి మొన్న శాసనమండలిలో ఆయన, ఆయన పార్టీ సభ్యులు సెల్ఫీలు దిగిన విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు.
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత, తానెందుకు ఆ నిర్ణయం తీసుకున్నదీ సభలో చెప్పుకుంటానని 45 నిమిషాలు బతిమాలినా కుదరదు పొమ్మన్న ఆనాటి శాసనసభ స్పీకర్, ఇవ్వాల్టి ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడిని పక్కన చేర్చు కున్న చంద్రబాబుకు శాసనవ్యవస్థల పట్ల ఎంత గౌరవం ఉందో అందరూ అర్థం చేసుకుంటారు. ఎన్టీఆర్ మాట్లాడితే ఎక్కడ సభ్యులు కరిగిపోరుు, మళ్లీ ఆయన పక్షం చేరిపోతారోనన్న భయంతో ఆనాడు ఆయనను మాట్లాడ నివ్వలేదు. ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడు తరిమెల నాగిరెడ్డి శాసన సభ్య త్వానికి రాజీనామా చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తృణీకరించి వెళ్లిన నాడు కూడా ఆయన సుదీర్ఘ చారిత్రక ప్రసంగం చేసే అవకాశం కల్పించిన గొప్ప సంప్రదాయాలను పాటించిన శాసనసభలోనే ఎన్టీరామారావుకు చంద్రబాబు బృందం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయన నోరు నొక్కే సింది. శాసనవ్యవస్థల పట్ల తెలుగుదేశం నాయకత్వానికి ఉన్న గౌరవం ఇది.
టీడీపీ స్థాపించమని చెప్పిన అల్లుడు
ఇక చంద్రబాబు శాసనసభ ఆవరణలో తన పెళ్లిరోజున మీడియాతో పంచుకున్న అనుభవాలలో ఆయన వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా, రాజకీయాల గురించి చెప్పుకుంటే ఆయన మాట్లాడిన వాటిలో చాలా అసత్యాలు ఉన్నాయని ఆయా సందర్భాలలో క్రియాశీలక వృత్తి బాధ్యతలు నిర్వర్తించిన విలేకరులంతా ఒప్పుకుంటారు. వారిలో కొందరయినా ఇంకా జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఆ రోజున ఆయన మాట్లాడిన రాజకీయ సంబంధమైన విషయాలకే వస్తే అంజయ్య మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి రావడంలో అప్పటి తన మంచి మిత్రుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుదల గురించి చెప్పలేదు, సన్నిహితంగా ఉండేవాళ్లం అని మాత్రం చెప్పి వదిలేశారు. నిజమే, రాజశేఖరరెడ్డి విగ్రహం కనిపిస్తేనే సహించలేని, ఆ పేరు వింటేనే భరించలేని స్థితిలో తనకు మంత్రి పదవి రావడానికి రాజశేఖరరెడ్డి పట్టుపట్టారని చంద్రబాబు ఎందుకు చెప్పుకుంటారు?
అప్పట్లో అంజయ్య మంత్రివర్గంలోకి వైఎస్‌ఆర్, చంద్రబాబు ఇద్దరికీ ఎలా స్థానం లభించిందో అప్పటి తరం నాయకులు, జర్నలిస్ట్‌లలో ఎవరిని అడిగినా చెపుతారు. ఎన్టీ ఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేనని కూడా చెప్పారు చంద్ర బాబు. అదే నిజమైతే 1982లో ఎన్టీ రామారావు పార్టీ ప్రకటించి, న్యూ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో మీటింగ్ పెట్టి ప్రకటన చేసిన నాటి నుండి, ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన కొన్ని మాసాల వరకు ఆయన వెంట ఎక్కడా చంద్రబాబు ఎందుకు కనిపించలేదు? ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని తాను అనలేదని కూడా చెప్పారు. 1983 ఎన్నికల ముందు పార్టీ నాయకు రాలు (ఇందిరాగాంధీ) ఆదేశిస్తే మామ మీద పోటీకి సిద్ధమని చంద్రబాబు చేసిన ప్రకటన కటింగ్‌లు గత మూడురోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. పత్రికలు ఆనాడు అసత్యాలు రాసి ఉంటే ఆయన ఆనాడే ఎందుకు ఖండించలేదు?
చంద్రబాబు తెలుగుదేశం ప్రవేశం ఆ పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న వాళ్లెవరికీ ఇష్టంలేదు. 1985 నాటి గండిపేట మహానాడులో చంద్రబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. నాడు ఆయన మామ మీద చేసిన సవాలు తాలూకు పత్రికల వార్తల కటిం గ్‌లు ఆ మరునాడు తెలుగు విజయం ఆవరణ అంతటా కనిపించాయి. ఆయన ప్రధాన కార్యదర్శి కాకుండా అడ్డుకునేందుకు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గమే ఈ కటింగ్‌లు బయటికి తెచ్చిందని వార్తలు కూడా వచ్చారు. ఆ విషయంలో తనను అనవసరంగా వివాదంలోకి ఈడ్చారని దగ్గుబాటి మీడియా మీద అలిగారు కూడా. అయినా చంద్రబాబునాయుడే ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదంతా నేను ‘ఉదయం’ దినపత్రికకు రిపోర్ట్ చేశాను. ఆ తరువాత అధికారం కోల్పోయాక ఎన్.టి. రామారావు అనేక సందర్భాలలో ఈ విషయం ప్రస్తావించి తనకు జరిగిన ద్రోహానికి బాధపడ్డారు.
మరి ఆనాడు పత్రికలు అసత్యాలు రాశాయా? రాస్తే మీరెందుకు ఖండించలేదు అని మొన్నటి మీడియా చిట్‌చాట్‌లో స్నేహ పూర్వకంగా అయినా ఒక్కరూ చంద్రబాబును ప్రశ్నించలేకపోయారు. తనను టీడీపీలో చేరొద్దనీ, ఉన్న పార్టీ నుంచే పోటీ చెయ్యమని ఎన్టీఆర్‌గారే సూచించారని కూడా చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ది ఒక విభిన్నమైన పోకడ. రాజకీయాల్లో ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవ్వరూ ఇది నమ్మరు. ఎన్‌టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు చంద్రబాబు చేసిన మరో ప్రయత్నం ఇది. చంద్రబాబు వైస్రాయ్ హోటల్‌లో శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ్ అర్ధరాత్రి వెళ్లి పరిస్థితి వివరించినప్పుడు అధికారం పోతే పోయింది కానీ, ఎవరినీ బుజ్జగించేది లేదని ఖరాఖండిగా చెప్పిన ఎన్‌టీఆర్ చంద్రబాబును కాంగ్రెస్‌లోనే ఉండి పదవి కాపాడుకో అని చెప్పారంటే ఎవరు నమ్ముతారు?
పుట్టగానే పరిమళించిన పూవు
ఇది ఎన్‌టీఆర్ వ్యక్తిత్వాన్ని తగ్గించి చూపే ప్రయత్నమే. రెండుసార్లు ప్రధాన మంత్రి పదవి వద్దన్న మాట నిజమే. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ తరహాలో రాజకీయ చతురత లేని వ్యక్తి కాదు కాబట్టే ఆయన ప్రధాని పదవిని వద్దను కున్నారప్పుడు. బయటి నుండి కాంగ్రెస్ ఇచ్చే మద్దతు మీద ఆధారపడి నడిచే యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రధాని పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు అని తెలుసు కాబట్టే వద్దనుకున్నారు. ఆనాడు ప్రధానమంత్రి పదవి తీసు కుంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పదవి చేజారిపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మీదా, పార్టీ మీదా పట్టు సడలిపోతుంది అని ఆయన కంటే బాగా ఎవరికీ తెలుస్తుంది. 13 ఏళ్ల లోకేశ్‌బాబు ప్రధాని పదవి టెంపరరీ, ముఖ్యమంత్రి పదవి పర్మినెంట్ అని తండ్రికి సలహా ఇచ్చాడంటే నమ్మదల చుకున్న వారు నమ్మొచ్చు కానీ అది ఆనాడు చంద్రబాబు అభిప్రాయమే.
ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం అని ఆయన నమ్మినంతగా ఇంకెవరూ నమ్మరు. ఏ ఎన్నికలూ స్వశక్తితో గెలవని చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక 2020 దాకా తానే ముఖ్యమంత్రిని అనుకుని 2004లో ఓటమి చవి చూశారు కదా! రానున్న మంత్రివర్గ విస్తరణలో లోకేశ్‌ను మంత్రిని చేయబో తున్నారనే వార్తలు వస్తున్నారుు, ఇప్పటికే ఆయన తండ్రి చాటున రాజకీయా లనూ, పాలననూ చక్కబెడుతున్నట్టు కూడా ప్రచారంలో ఉంది కాబట్టి 13 ఏళ్ల లోకేశ్ సలహా అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు ఆ కోణంలో ఏమన్నా ఉపయోగపడవచ్చు. పూవు పుట్టగానే పరిమళించింది అన్నట్టు లోకేశ్‌బాబు 13వ ఏటనే తండ్రికి రాజకీయ సలహాదారు అయ్యారన్నమాట.
ఇక భారతీయ జనతా పార్టీతో స్నేహం కారణంగా మైనారిటీలు తన పార్టీకి దూరమయ్యారన్న విషయం గ్రహించిన చంద్రబాబు అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు తప్ప ఆనాడు చంద్రబాబు ఆ పదవికి హామీ ఇచ్చింది కృష్ణకాంత్‌కేనన్నది సత్యం. మధ్యలో వదిలేసి ఇప్పుడు మళ్లీ మిత్రుడయ్యాడు కాబట్టి కమలనాథులు కలాం మా అభ్యర్థి, చంద్రబాబుకు సంబంధంలేదు అని చెప్పుకోలేకపోవచ్చు. మనం ఏమైనా మాట్లాడొచ్చు కానీ, చరిత్రను మార్చలేం కదా! ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com