
సాక్షి, హైదరాబాద్: నమ్మిన వారిని ముంచడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజమని, ఆయనలో విశ్వసనీయత, విలువలు ఏ కోశానా లేవని వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా మండలి సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. చంద్ర బాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభమై నాలుగు దశాబ్దాలు పూరైన సందర్భంగా పత్రికలు, ఛానెళ్లు, ఆయన వల్ల అయాచితంగా లబ్దిపొందిన వారంతా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పారు. ‘పదవి కోసం ఎవరినైనా ముంచు..’ అనేదే చంద్రబాబు ప్రజలకిచ్చే సందేశమని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు మంగళ వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నమ్మించు, వంచించు, దోచేయ్ అన్నది చంద్రబాబుకు బాగా తెలిసిన పదాలని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమన్నారు.
ఊసరవెల్లికీ తర్ఫీదునివ్వగల సమర్థుడు
చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులే నమ్మరని అంబటి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టినట్లు, రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టునూ నిర్మించినట్లు, చివరకు ఐటీ, సెల్‌ఫోన్ తెచ్చింది తానేనని సత్య నాదెళ్ల, పీవీ సింధును కూడా తానే తయారు చేశానని చంద్రబాబు నమ్మశక్యం కాని మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై గతంలో ఓ వ్యక్తి పుస్తకాలు రాశారని అందులో అన్నీ వ్యతిరేక అంశాలే ఉన్నాయన్నారు. ఇపుడు మాత్రం టీవీల్లో బ్రహ్మాండంగా చెబుతూ చంద్రబాబు భజన చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఊసరవెల్లికి కూడా రంగులు మార్చడంలో తర్ఫీదు నివ్వగల ఘనుడన్నారు. ఎన్టీఆర్ తెరపై నటిస్తే.. చంద్రబాబు జీవితంలో నటిస్తూ తెలుగు ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఎన్ని మాటలు మార్చారో తెలిసిందేనన్నారు. రాజకీయ అవకాశవా దానికి చంద్రబాబు పరాకాష్ట అని గతంలో 5 ఏళ్లు బీజేపీతో, ఇప్పుడు 4 ఏళ్లు బీజేపీతో బాబు çసంసారం చేస్తున్నారని విమర్శించారు.
40 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారు?
చీమలు పెట్టిన పుట్టలోకి పాములు చేరినట్లు.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి ఎన్టీఆర్‌ను సైతం మెడ పట్టుకొని బయటకు పంపించిన చరిత్ర చంద్రబాబుదని అంబటి ధ్వజమెత్తారు. నిజాయితీ గురించి ఆయన చెప్పటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులపై విచారణ జరిగితే ఈ రాష్ట్రంలో ఆయనకు నూకలు చెల్లుతాయన్నారు. చంద్రబాబు నదుల్ని, నిధుల్ని కూడా తాకట్టు పెడతారన్నారు. 40 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం ఒరగబెట్టారో ఒక్కటైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. వెన్నుపోటు తప్ప ఆయన చేసింది ఏమీ లేదన్నారు. చెడు సంప్రదాయాలను అనుసరిస్తున్న చంద్రబాబును తెలుగు ప్రజలంతా బహిష్కరించాలని పిలుపు నిచ్చారు.