30 నుంచి మద్యంపై యుద్ధం
– ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మద్యంపై యుద్ధాన్ని ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు పేర్కొన్నారు. శనివారం కార్మిక, కర్షక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 35 బార్లు, 203 వైన్ షాపులు, 2,000లకుపైగా బెల్టుషాపులు ఉన్నాయన్నారు. వీటిలో చాలా దుకాణాలు ప్రజల ఆవాసాలు, గుడులు, బడులకు వెయ్యి మీటర్లలోపే ఉన్నాయన్నారు. ఇది మద్యం పాలసీకి వ్యతిరేకమని, ప్రజలకు ఇబ్బంది కలిగించే షాపులను 30వ తేదీలోపు తొలగించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో మద్యాన్ని నియంత్రిస్తానని, బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేస్తానని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత మరచిపోయారన్నారు. కర్నూలులో నిబంధనలు ప్రకారం ఎక్కడా మద్యం షాపులు లేవన్నారు. వీటిని వెంటనే రద్దు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మహిళలు కేఎస్ పద్మ, సుజాత, ఉమా, అరుణ పాల్గొన్నారు.