వరంగల్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఎన్నికల ఏర్పాట్లను, ఈవీఎంల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అధికారులను అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటరుకు సన్మానం చేశారు. కలెక్టర్ కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓటరకు పూలతో స్వాగతం పలికారు.
ఎన్నికల మరిన్ని విశేషాలు:
- వరంగల్ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
- లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలలో 10 వేల మందికిపైగా భద్రత సిబ్బంది ఏర్పాటు
- తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
- మావోయిస్టుల కంచుకోట టేకులగూడెంలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- రఘునాథపురం మండలం కంచరపల్లిలో మొరాయించిన ఈవీఎంలు, కాసేపు నిలిచిపోయిన పోలింగ్
- స్టేషన్ ఘనాపూర్ మండలం మల్కాపూర్ లో ఈవీఎం మొరాయింపు. ఫ్యాన్ గుర్తు బటన్ పనిచేయలేదంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆందోళన
- తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ తొర్రురు మండలం టీక్యాతండా గిరిజనులు పోలింగ్ బహిష్కరణ. తండా వాసులతో చర్చలు జరుపుతున్న ఎన్నికల అధికారి భన్వర్లాల్
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు
- పర్వతగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు
- సంగెలం మండలం బొల్లికుంటలో ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్