
టీఆర్ఎస్ ఖాతాలోకి కాంగ్రెస్, బీజేపీ ఓట్లు
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయా? టీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును యథాతథంగా కాపాడుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఓట్లలోంచి కొన్నింటిని కూడా తన ఖాతాలోకి మళ్లించుకోవడం ద్వారా రికార్డు స్థాయి మెజారిటీని సాధించుకోగలిగింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను, ప్రస్తుత ఉపఎన్నికల్లో వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషిస్తే కాంగ్రెస్, బీజేపీల ఓట్లకు ఈసారి గండిపడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల కంటే ఈసారి ఆ పార్టీ అభ్యర్థికి 7.9 శాతం ఓట్లు తగ్గాయి. అలాగే బీజేపీకి పోలైన ఓట్లు కూడా 3.4 శాతం తగ్గాయి. ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం.. ఈసారి ఓట్లు గణనీయంగా పెరిగాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఓట్లను అటు టీఆర్ఎస్‌తో పాటు స్వతంత్రులు సైతం చీల్చుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పార్టీ | 2014 మే ఎన్నికలు | 2015 నవంబర్ ఉప ఎన్నికలు | తేడా |
టీఆర్ఎస్ | 56.2 | 58.9 | +2.7 |
కాంగ్రెస్ | 22.9 | 15.0 | -7.9 |
బీజేపీ | 15.9 | 12.5 | -3.4 |
ఇతరులు | 5.0 | 13.7 | +8.7 |
2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానంలో 76 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 69 శాతానికి తగ్గింది. అయినా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 56.2 శాతం ఓట్లు రాగా ఈసారి 58.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, ఆ పార్టీకి 2.7 శాతం ఓట్లు పెరిగాయన్నమాట. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 22.9 శాతం ఓట్లు పోలవగా, ఈసారి అది 15 శాతానికి పడిపోయింది. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించుకున్న ఓట్లలో ఆ పార్టీకి ఈసారి 7.9 శాతం గండిపడింది.
బీజేపీ పరిస్థితి కూడా అంతే. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేసిన బీజేపీకి 15.9 శాతం ఓట్లు రాగా ఈసారి ఆ పార్టీ 12.5 శాతానికి పడిపోయింది. అంటే.. ఈ ఎన్నికలో 3.4 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. విచిత్రమేమంటే గతంలో మిగలిన పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి కేవలం 5 శాతం మాత్రమే ఓట్లు రాగా ఈసారి ఏకంగా 13.7 శాతం ఓట్లను సాధించుకున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలను, 2014లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషించిన పీపుల్స్ పల్స్ సంస్థ ఓట్లను సాధించుకోవడంలో ఏ పార్టీ ప్రయోజనం పొందింది.. ఏ పార్టీ నష్టపోయిందన్న వివరాలను వెల్లడించింది.