వెచ్చని అతిథులు
వెచ్చని అతిథులు
Published Wed, Nov 2 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
- జిల్లాకు చేరిన 'టిబెట్' వాసులు
- కర్నూలులో ఉన్ని దుస్తుల విక్రయాలు
- చలికాలంలో పెరిగిన డిమాండ్
కర్నూలు(రాజ్‌విహార్): చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలు. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన అతిథులు వీటిని అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు కొనసాగుతున్నాయి.
అక్టోబరు నెల ముగిసి నవంబరు వచ్చేసిందంటే వాతావరణంలో మార్పులు వస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయి. చలి పెరుగుతుంది. అలాంటప్పుడు చలికి 'స్వెటర్' వేస్తే వణుకు తగ్గుతుంది. గత ఐదారురోజుల నుంచి చలి పెరుగుతుండడంతో రక్షణ పొందేందుకు ఉలన్ (ఉన్నీ) దుస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మన అవసరాలు గుర్తించి 'టిబెట్' దేశ అతిధులు కర్నూలు నగరానికి చేరుకుకున్నారు. రంగు రంగుల ఉలన్ స్వెటర్లు మనకు కావాల్సిన రకాల్లో అమ్మకాలకు పెట్టారు. నేపాల్, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఈ వెచ్చని దుస్తుల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిపోతోంది.
టిబెట్ నుంచి..
కార్తీక మాసం ప్రారంభమైందంటే ఉష్ణోగ్రతలు మారిపోతాయి. అప్పటి వరకు ఉన్న వేడి తగ్గుముఖం పడితే చలి పంజా విసిరి వెన్నులోనే వణుకు పుట్టిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి చెప్పలేనిది. ఉన్ని దుస్తులు వేసుకుంటే వెచ్చదనం వస్తుంది. మంచు దేశాల నుంచి దిగుమతి అయిన ఉన్ని దుస్తులంటే మరింత ఇష్టపడుతాం. ఉలన్ దుస్తులకు పెట్టింది పేరుగా టిబెట్ దేశస్తులు ఎప్పటి లాగే వలస పక్షుల్లా కర్నూలుకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా కర్నూలుకు వచ్చి నగరంలోని అవుట్ డోర్ స్టేడియం (ఎస్టీబీసీ కళాశాల వెనుక) ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌పై షెడ్లు వేసుకొని ఉలన్ దుస్తులను విక్రయిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వాటిని తెప్పించి అమ్ముతున్నారు. మూడు నెలల పాటు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. శీతాకాలంలో వెచ్చని దుస్తులు అమ్మి ఫిబ్రవరి నెలలో తిరిగి వెళ్తారు.
మనస్సుకు హత్తుకునే రకాలు:
కొనుగోలుదారుల మనస్సుకు హత్తుకునే వెచ్చని దుస్తులు అమ్మకానికి పెట్టారు. ముఖ్యంగా చలితోపాటు వర్షానికి కూడా తట్టుకునేలా టూ ఇన్ వన్ వంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్నారులను ఆకర్షించేవిధంగా పలు రకాల బొమ్మలు, జంతువుల బొమ్మలతో కూడినవి ఉన్నాయి. మహిళలు, వృద్థులకు అనుకూలమైన బటన్, జిబ్, బనియన్ టైప్ తదితర రకాలు వివిధ రంగుల్లో అమ్మకానికి పెట్టారు. చెవులను కప్పేసేలా మాంకీ క్యాప్‌లు, ఆఫ్ టోపీలు, ఉలన్ క్లాత్‌లు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులను అందుబాటులో ఉంచారు. వీటి ధర రూ. 200 నుంచి రూ.1300 వరకు నాణ్యతను, సైజును బట్టి ఉంటోదని వ్యాపారస్తులు చెబుతున్నారు.
తగ్గిన ఉష్ణోగత్రలు:
గత పది రోజులుగా పరిశీలిస్తే ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 7వ తేదిన గరిష్ట ఉష్ణోగ్రతలు 35.0 డిగ్రీలు ఉండగా 16వ తేదిన 23.4, మంగళవారం 30.1 డిగ్రీలుగా నమోదు అయింది.
Advertisement
Advertisement