పెకైగసిన పాతాళగంగ
వేసవిలో తాగడానికి నీళ్లు దొరికితే చాలనుకుంటాం. అలాంటిది ఓ రైతు పొలంలో వేసిన బోరు నుంచి పాతాళ గంగ ఎగిసిపడుతోంది. నేలమట్టం నుంచి సుమారు 50 అడుగుల పెకైగిరి దుముకుతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన బీహెచ్ గిరిరెడ్డి పొలంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గిరిరెడ్డికి ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు వద్ద విజయవాడ-మచిలీపట్నం హైవేకు ఆనుకొని కొంత పొలం ఉంది. ఇందులో చెరకు సాగుచేశారు. పొలంలోని 40అడుగుల లోతు ఉన్న బోరులో అరకొరగా నీరు వస్తుండడంతో అదే స్థానంలో మరింత లోతుకు బోరు తవ్వించారు. సుమారు 150 అడుగుల లోతులో జలం వచ్చింది. శుక్రవారం బోరు పనులు పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం బోరు ఆన్ చేశారు. ఇంతలో బోరు గొట్టం వద్ద నీరు ఉబికి రావడం గమనించి మోటారు ఆఫ్ చేశారు.
రెండు నిమిషాల వ్యవధిలో జలధార భారీగా ఎగిసిపడింది. నీరు ఎంతవేగంతో పెకైగసిందంటే ఆ స్పీడుకు బోరులో అమర్చిన సబ్‌మెర్సిబుల్ మోటారుతో సహా పైపును విసిరేసింది. సుమారు 50నుంచి 70 అడుగుల ఎత్తున ఎగసిపడుతోన్న జలధారను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తీవ్రమైన ఒత్తిడితో నీరు ఉబికివస్తుండడంతో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయేమోనని స్థానికులు చర్చించుకున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. నీరు ఎగిసిపడడానికి కారణాలు నిపుణులు వెల్లడించాల్సి ఉంది.