అవి‘నీటి’ వ్యాపారం
– గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని అక్రమంగా తరలింపు
– ఎకరాకు రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్న విష్ణువర్గీయులు నేతలు
– అడ్డుకోలేక పోతున్న ఎమ్మెల్యే మణిగాంధీ
కోడుమూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎండుతున్న పంటలను కాపాడుతామంటూ అపర భగీరథుల్లా వ్యవహరిస్తున్న తెలుగు దేశం నేతలు తెరవెనుక అవి‘నీటి’ వ్యాపారానికి తెరతీశారు. అధికారం చేతుల్లో ఉందని తమకు పట్టున్న ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నట్లు నటిస్తూనే అక్రమ దందా నడపుతున్నారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విష్ణువర్దన్‌రెడి.. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎల్లెల్సీ ఆయకట్టుకు నీరు వదలాలని ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్ననాయుడుతో సిఫారస్ లేఖను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ చేత అమోదింపజేసుకున్నట్లు సమాచారం. దీంతో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కష్ణగిరి మండలాల్లోని 10వేల ఎకరాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని వదలాలని అధికారులకు ఆదేశాలొచ్చినట్లు తెలుస్తోంది. 10వేల ఎకరాలకు నీటిని వదిలితే గాజులదిన్నె ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.30 టీఎంసీల నీరు నిల్వవుంది. ఎల్లెల్సీ గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు రోజు 110 క్యూసెక్కులు, కుడి కాల్వకు 200క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. 10వేల ఎకరాలు తడిపేందుకు ఎన్ని రోజులు నీళ్లు వదలాలన్న నిబంధన కూడా విధించలేదని అధికారులు చెబుతున్నారు.
ఎకరాకు రూ. 2 వేలు ఇవ్వాల్సిందే
ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న ముసుగులో గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని ఎల్లెల్సీ ఆయకట్టుకు నీటిని మళ్లించి గూడూరు సి.బెళగల్ మండలాల్లోని రైతుల నుంచి కొంతమంది విష్ణువర్గీయులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎకరాకు రూ.2వేలు ఖరాఖండిగా వసూలు చేస్తున్నారు. కరువు కాలంలో ఇవ్వలేమని రైతులు చెబుతున్నా వినడం లేదు. డబ్బులివ్వకపోతే పొలాలకు నీటిపారుదల నిలిపేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఖాళీ అవుతున్న ప్రాజెక్ట్
ఇప్పటికే పది రోజులుగా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తాగునీటి అవసరాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నీళ్లు ఉండవు. పందికోన రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా నీరు గాజులదిన్నె ప్రాజెక్టులో ఒకటిన్నర టీఎంసీ నీటిని నిల్వవుంచాలన్న ప్రతిపాదన అటకెక్కింది. హంద్రీనీవా నీటిని గాజులదిన్నె ప్రాజెక్టుకు తరలిస్తే కొంత వరకు న్యాయం చేసినట్లవుతుంది. గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల రైతులకు ఎల్లెల్సీ నీటిని విడుదల చేయించుకోవాల్సివుంది. అధికారులు, నాయకులు చేతగాక గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని అక్రమంగా తరలించడంతో ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మణిగాంధీ స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే చర్యలు తీసుకోకపోతే కోడుమూరు మండలంలోకి రానివ్వమని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కష్ణ హెచ్చరిస్తున్నారు.
========================
విష్ణు వర్గీయులపై కలెక్టర్ ఫిర్యాదు
కర్నూలు(అగ్రికల్చర్): ఆయకట్టుదారుల నుంచి నీటి కోసం ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయా గ్రామాల రైతులు సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. మునగాల ఎత్తిపోతల పథకం కింద మునగాల, గూడూరు, ఖానాపురం, పర్ల, గుడిపాడు గ్రామాలకు చెందిన 2,300 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మునగాల లిఫ్ట్ నుంచి నీటి విడుదల ఎల్లెల్సీ ఆధీనంలో ఉంది. తెలుగుదేశం నాయకుడు, గూడూరు ఎంపీపీ భర్త మహేశ్వరరెడ్డి ఎల్‌ఎల్‌సీ అధికారులు రాకుండ చేసి డబ్బులు ఇస్తేనే నీళ్లు అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయకట్టుకు ఎకరాకు రూ.1500, నాన్ ఆయకట్టుకు రూ.3000 ప్రకారం వసూలు చేస్తున్నారని రైతులు తీవ్రంగా ధ్వజమెత్తారు. వివిధ గ్రామాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చి మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
రేమట స్కీమ్ పరిధిలోను...
కర్నూలు మండలం రేమట లిఫ్ట్ కింద కొత్తకోట గ్రామానికి చెందిన 700 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు. రేమట లిఫ్ట్ నుంచి ఈ భూములకు నీళ్లు ఇవ్వాలంటే దేశం నాయకులకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోందని, సర్పంచు కుమారుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నేతలు రాఘవరెడ్డి, గిడ్డయ్యలు ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి పేరు చెప్పి ఎకరాకు రూ.2000 వరకు వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మామూళ్లు ఇస్తేనే పంటలకు నీళ్లు ఇస్తామని కరాకండిగా చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.