నీటి కోసం రోడ్డెక్కిన జనం
రెండు గంటల పాటు రాస్తారోకో గర్గుల్ వాసుల ఆందోళన
అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మహిళలు
కామారెడ్డి రూరల్: గొంతెండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ గర్గుల్ గ్రామస్తులు రోడ్డెక్కారు. కామారెడ్డి-రామారెడ్డి రోడ్డుపై గురువారం రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉదయం ఖాళీ బిందెలతో స్థానికులు రాస్తారోకో చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, బోర్లు ఎత్తిపోవడంతో రోజూ వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడితో పాటు అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు.
రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు ఇక్కడకు వచ్చి గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే, అధికారులు వచ్చి నీటి సమస్యను తీర్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఓ కానిస్టేబుల్ గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. మరోవైపు తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గాయత్రి వచ్చి వారితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పగా, తమ కాలనీకి వచ్చి సమస్యను చూడాలని పట్టుబట్టారు.
దీంతో వారు కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. సమీపంలో ఉన్న నాలుగు వ్యవసాయ బోర్లను సైతం పరిశీలించిన అధికారులు, రైతులతో మాట్లాడారు. అయితే, బోర్లను అద్దెకు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. వారం రోజుల్లో పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను సరఫరా చేస్తామని, అప్పటివరకు రోజూ రెండు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు. మాజీ ఎంపీపీ నిమ్మ లింగవ్వ, రవీందర్‌రెడ్డి, భీంరెడ్డి, శ్రీనివాస్, సాయిలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.