సిద్దంగిర్గా గ్రామంలో పేరుకుపోయిన మురుగు
- పారిశుద్ధ్య లోపం.. ప్రబలుతున్న వ్యాధులు
- పరిశుభ్రత, అవగాహనతో ఆరోగ్య పరిరక్షణ
కంగ్టి: గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. పైప్‌లైన్ లీకేజీల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మరి కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. జ్వరం, జలులు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడిన ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
మండలంలోని జమ్గి (బి) సాధు తండాలో మూడు నెలల క్రితం డెంగీతో జనాలు బెంబేలెత్తగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అదుపులోకి తెచ్చారు. గత ఆగస్టు దామర్‌గిద్దాలో అతిసార వ్యాధితో ఒకరు మరణించారు. వారం రోజుల నుంచి సిద్దంగిర్గా గ్రామంలో చికన్ గున్య వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్య శిబిరం కొనసాగుతోంది.
ముందస్తు జాగ్రత్తలు అవసరం
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో దోములు, ఈగలు వృద్ధి చెందుతాయి. తద్వారా వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం, మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా దోమలు వృద్ధి చెందుతున్నాయి. నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో పాచి పోరుకుపోతోంది. పైప్‌లైన్‌ల లీకేజీల వల్ల తాగునీరు కలుషితం అవుతోంది.
కనీస జాగ్రత్తలు పాటిస్తే రోగాలను దూరం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం మంచిదన్నారు. ఎక్కవ రోజులు నీటిని నిల్వ ఉంచడం మంచిదికాదని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వేడివేడి భోజనం తినడం ద్వారా రోగాలను దూరం చేయవచ్చని పేర్కొన్నారు.