kangti mandal
-
గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్..!
సాక్షి, నారాయణఖేడ్: చిగురు పండుగ విందులో పాల్గొనేందుకు గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్న రౌతు మార్గమధ్యంలో విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. సోదరి ఇంట విందు కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షాక్ కొట్టడంతో యజమాని(రౌతు) సహా గుర్రం మృతి చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఎక్కువ శాతం తండాల్లో ప్రతి ఏటా జూలైలో గిరిజనులు చిగురు పండుగ నిర్వహిస్తారు. భీంరా పార్తు తండాకు చెందిన రాథోడ్ వెంకట్(45) చింతమణి తండాలో తన సోదరి ఇంట ఏర్పాటు చేసిన చిగురు పండుగ విందు కోసం గుర్రంపై బయల్దేరాడు. భీంరా శివారులోకి చేరుకోగానే గుర్రం కాళ్ల చప్పుడుకు పంటల రక్షణ కోసం అడవి పందుల బెడదను కాపాడేందుకు ఉంచిన కుక్కలు అరిచాయి. కుక్కల అరుపులకు గుర్రం బెదిరిపోయింది. పక్కనే ఉన్న పంట చేలోకి పరుగులు పెట్టింది. ఈ క్రమంలో పొలంలో వేళాడుతున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు గుర్రం మెడకు తగిలాయి. క్షణంలో విద్యుత్ షాక్ తగలడంతో వెంకట్, అతను స్వారీ చేస్తున్న గుర్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. పొలం యజమాని పంట కాపలా కోసం వెళ్లి చూసి వెంకట్ మృతి చెందిన విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడు వెంకట్ భార్య వాలబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మండలంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ శుభకార్యాలు ఉన్నా, ప్రముఖ రాజకీయ నాయకుల సమావేశాలు ఉన్నా గుర్రంతో మృతుడు వెంకట్నాయక్ అందరిని ఉత్సాహపరిచేవాడు. అదే గుర్రంపై స్వారీ చేస్తూ విద్యుత్ షాక్ తగిలి మరణించడంతో పార్తు తండాలో విషాదం నెలకొంది. మృతుడు వెంకట్కు భార్య, పిల్లలు ఉన్నారు. -
గ్రామాల్లో తాగునీరు కలుషితం
పారిశుద్ధ్య లోపం.. ప్రబలుతున్న వ్యాధులు పరిశుభ్రత, అవగాహనతో ఆరోగ్య పరిరక్షణ కంగ్టి: గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. పైప్లైన్ లీకేజీల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మరి కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. జ్వరం, జలులు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడిన ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని జమ్గి (బి) సాధు తండాలో మూడు నెలల క్రితం డెంగీతో జనాలు బెంబేలెత్తగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అదుపులోకి తెచ్చారు. గత ఆగస్టు దామర్గిద్దాలో అతిసార వ్యాధితో ఒకరు మరణించారు. వారం రోజుల నుంచి సిద్దంగిర్గా గ్రామంలో చికన్ గున్య వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్య శిబిరం కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తలు అవసరం వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో దోములు, ఈగలు వృద్ధి చెందుతాయి. తద్వారా వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం, మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా దోమలు వృద్ధి చెందుతున్నాయి. నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో పాచి పోరుకుపోతోంది. పైప్లైన్ల లీకేజీల వల్ల తాగునీరు కలుషితం అవుతోంది. కనీస జాగ్రత్తలు పాటిస్తే రోగాలను దూరం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం మంచిదన్నారు. ఎక్కవ రోజులు నీటిని నిల్వ ఉంచడం మంచిదికాదని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వేడివేడి భోజనం తినడం ద్వారా రోగాలను దూరం చేయవచ్చని పేర్కొన్నారు.