తోటపల్లిలో నీటి కటకట
-
గ్రామస్తుల ఆందోళన
-
వైసీపీ నేత ట్యాంకర్‌తో నీటి సరఫరా
బెజ్జంకి : రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దత్తత గ్రామమైన మండలంలోని తోటపల్లిలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తలెత్తింది. దీంతో గ్రామపంచాయతీ ముందు రహదారిపై మహిళలు, గ్రామస్తులు శుక్రవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. వెఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్‌రావు ఆందోళనకు మద్దతు తెలిపారు. గ్రామంలో వారం రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి హరీష్‌రావు స్వగ్రామం, ఎమ్మెల్యే రసమయి దత్తత గ్రామంలో వర్షాకాలంలో ప్రజలు నీటి కోసం ఆందోళనలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇంటింటికి నాళ్లు అందిస్తామంటున్న ప్రభుత్వం వాడవాడకు కూడా నీటి సరఫరా చేయడం లేదని విమర్శించారు. శ్రీనివాసరావు ఫోన్‌లో అధికారులతో చర్చించిన అనంతరం ఆందోళన విరమించారు. శ్రీనివాసరావు తన ట్యాంకర్ ద్వారా గ్రామంలో నీటి సరఫరా చేపట్టారు. ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.