ఇక నెల రోజులే! | water problem of rayadurgam muncipality | Sakshi
Sakshi News home page

ఇక నెల రోజులే!

Published Sun, Jul 2 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

ఇక నెల రోజులే!

ఇక నెల రోజులే!

‘దుర్గం మున్సిపాలీటీకి తాగునీటి గండం
ఎస్‌ఎస్‌ ట్యాంకులో 30 రోజులకు సరిపడ హెచ్చెల్సీ తాగునీరు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే తప్పని నీటి కష్టాలు


రాయదుర్గం టౌన్‌ : రాయదుర్గం పట్టణానికి తాగునీటి గండం పొంచి ఉంది. తాగునీటిని సరఫరా చేస్తున్న కణేకల్లులోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో కేవలం ఒక నెలరోజుల పాటు సరిపడే నీరు నిల్వ ఉంది. దీంతో 62 వేల మంది పట్టణవాసుల్లో కలవరం మొదలైంది. తుంగభద్ర జలాశయానికి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై నేటికీ అధికారులు, పాలకులు చర్చించిన దాఖలాలు లేవు.

రోజు విడిచి రోజు నీటి విడుదల
ఎస్‌ఎస్‌ ట్యాంకు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3,052 మిలియన్‌ లీటర్ల కాగా, ప్రస్తుతం 728 మిలియన్‌ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీటిని నెలరోజుల పాటు అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక రోజుకు ఒక మనిషికి తాగేందుకు , ఇతర అవసరాలకు 130 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా 70 లీటర్ల నీటిని మాత్రమే అందజేస్తున్నారు.

కనిపించని ప్రత్యామ్నాయం
కనీస నీటి అవసరాలకు ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు అధికారులు, పాలకులు నేటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దం చేసిన దాఖలాలు లేవు. పట్టణంలో మొత్తం 31 వార్డులుండగా ఇందులో 10 వార్డుల్లో ఉప్పు నీటి బోర్లు, నీటి ట్యాంకులు, చేతిపంపులు ఉన్నాయి. మిగిలిన వార్డుల్లో  కొళాయిల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి కాలనీల్లో యుద్దప్రాతిదికన బోర్లు ఏర్పాటు చేయడం, మరమ్మతుకు నోచుకున్న చేతిపంపులు, బోర్లను వినియోగంలోకి తేవడం లాంటి చర్యలను అధికారులు చేపట్టడం లేదు.

నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం
ఎస్‌ఎస్‌ ట్యాంకుకు సకాలంలో నీరు రానిపక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్యాంకర్ల సంఖ్యను పెంచడమే కాకుండా నీటి అవసరాలు తీర్చేందుకు బళ్లారి రోడ్డులోని జీఎల్‌ఎస్‌ఆర్‌ పరిసరాల్లో బోర్లు వేసి సగం పట్టణానికి నీటిని అందజేసే చర్యలు చేపడతాం. మిగిలిన చోట్ల కూడా బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తాం.
– సురేష్, మునిసిపల్‌ డీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement