జఠిలం
♦ తాగునీటికి తాండూరు జనం విలవిల
♦ ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలో నీటి ఎద్దడి
♦ రెండు మూడు రోజులకోసారి సరఫరా
♦ చేతిపంపుల వద్ద మహిళల పాట్లు
కాగ్నా ఎండిపోయింది. పంపుహౌస్‌ల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. ఎన్నడూ లేనంతగా విపత్కర పరిస్థితులు ఈసారి నెలకొన్నాయి. తాండూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద మహిళలు యుద్ధాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు నీటి కోసం పరుగులు తీస్తున్నారు. ప్రతి బొట్టును జాగ్రత్తగా వాడుకుంటున్నా.. కుటుంబానికి సరిపడా నీళ్లు అందడం లేదు. ఇక చేతి పంపుల వద్ద భారీ క్యూలు నిత్యకృత్యం. మున్సిపాలిటీ అధికారులు రెండు బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నందున మరికొన్ని బోర్లు వేసి అదనపు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. - తాండూరు
కాగ్నా నదిలో భూగర్భజలాలు అడుగంటంతో రెండు పంప్‌హౌస్‌లో నీటి మట్టాలు తగ్గాయి. దాంతో ప్రస్తుతం రోజుకు 2.5 ఎంఎల్‌డీ నీటినే సరఫరా చేస్తున్నారు. రూ.25 లక్షల కరువు నిధుల నుంచి తాండూరులోని లారీ పార్కింగ్, అంబేద్కర్ పార్కు వద్ద బోర్లు వేశారు. నీళ్లు పడ్డాయి. రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కానీ అందరికీ తాగునీరు అందని పరిస్థితి.
తాండూరు : కరువు ధాటికి కాగ్నా ఖాళీ అయిపోయింది. భూగర్భజలాలు ఇంకిపోయాయి.. పంపుహౌస్‌ల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. ఎన్నడూ లేనంతంగా విపత్కర పరిస్థితులు నెలకొనడంతో తాండూరు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. రెండు, మూడు రోజులకోసారి తాగునీటి సరఫరాతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. చేతిపంపుల వద్ద మహిళలు గంటల తరబడి నిరీక్షిస్తూ పాట్లు పడుతున్నారు. చిన్నపిల్లలు, మగవారు సైతం చేతిపంపుల నుంచి బిందెలతో నీళ్లు మోస్తుండడం నీటి ఎద్దడి తీవ్రతకు నిదర్శనం. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఆదేశాలతో అధికారులు రెండు చోట్ల బోర్లు వేశారు. రెండు ట్యాంకర్ల ద్వారా అత్యవసరమైన వార్డుల్లో నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో మరికొన్ని బోర్లు వేసి, అదనపు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చేతింపులపై ఆధారం..
తాండూరు పట్టణంలోని చేతిపంపులపైనే జనాలు ఆధారపడ్డారు. 260 చేతిపంపులు ఉండగా 30 శాతం పని చేయడం లేదు. కొన్ని చోట్ల అధికారులు చేతిపంపులకు ఫ్లషింగ్ చేశారు. చేతిపంపుల వద్ద బిందె నీటి కోసం మహిళలతో పాటు చిన్న పిల్లలు, మగ వారుసైతం వద్దకు బిందెలతో పరుగులు తీస్తున్నారు. పట్టణంలోని హమాలీబస్తీ, గాంధీనగర్, ఇందిరానగర్, శాంతినగర్, గొల్లచెరువు తదితర ప్రాంతాల్లో చేతిపంపులను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
2.5 ఎంఎల్‌డీలే సరఫరా
తాండూరు పట్టణంలో మొత్తం 31 వార్డుల్లో 65 వేలకు పైగా జనాభా ఉంది. మొత్తం 7 వేల నల్లా కనెక్షన్‌లు ఉన్నాయి. కాగ్నా నది ఆధారంగా తాండూరువాసులకు రోజుకు సుమారు 6.5 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా జరిగేది. నదిలో భూగర్భజలాలు అడుగంటంతో రెండు పంప్‌హౌస్‌లో నీటి మట్టాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం రోజుకు 2.5 ఎంఎల్‌డీ మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. దీంతో తాగునీటికి కటకట ఏర్పడింది. రెండు, మూడు రోజులకొకసారి నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి. అదీ అరకొరగానే.
చేతిపంపుల వద్ద నిరీక్షణ
చేతిపంపుపైనే నీళ్ల కోసం ఆధారపడ్డాం. గంటలపాటు నీటి కోసం పడిగాపులు పడుతున్నాం. నల్లా నుంచి నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. పార్కు వద్ద ఉన్న చేతిపంపు పాడైంది. రెండో చేతిపంపు సరిగా పని చేయడం లేదు. అధికారులు మా ప్రాంతంలో బోరు వేసి సమస్య పరిష్కరించాలి. - నర్మదా, హమాలీబస్తీ
మరికొన్ని చోట్ల బోర్లు వేయాలి
రెండు బోర్లు వేశాం. ఇంకా రెండు చోట్ల బోర్లు వేయనున్నాం. ఆయా బోర్లను రిజర్వాయర్లకు అనుసంధానం చేసి నీళ్లు అందిస్తున్నాం. అత్యవసరమైన ప్రాంతాల్లో చేతిపంపులను బాగు చేశాం. కాగ్నా ఎండిపోవడంతో తాండూరులో నీటి ఎద్దడి తీవ్రమైంది. ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. నల్లాకు మోటారు బిగించరాదు. - సత్యనారాయణ, పురపాలక కమిషనర్
బోర్లు వేసినా..
నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టారు. రూ.25 లక్షల కరువు నిధుల్లో తాండూరు పట్టణంలోని లారీ పార్కింగ్, అంబేద్కర్ పార్కు వద్ద బోర్లు వేశారు. నీళ్లు కూడా పడ్డాయి. రిజర్వాయర్లకు అనుసంధానం చేసి నీటి సరఫరా చేస్తున్నారు. రెండు ట్యాంకర్ల ద్వారా వార్డుల్లో నీటి సరఫరా చేస్తున్నా అందరికీ పూర్తిస్థాయిలో తాగునీరు అందని పరిస్థితి.