– 60 వేల ఎకరాలకు నీరిస్తామన్న సీఎం
– 18వేల ఎకరాలకే సాధ్యమంటున్న అధికారులు
– పూర్తికాని పంట కాల్వ పనులు
– త్వరలో నీరు విడుదల
కర్నూలు సిటీ:
హామీ ఇదీ..
శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వచ్చిన వెంటనే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం.
– ఇటీవల జిల్లాకు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి.
వాస్తవం ఇదీ..
– హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 18 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు పంట కాల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 60 వేల ఎకరాలకు ఇవ్వడం సాధ్యం కాదు.
– ఇరిగేషన్ అధికారుల వ్యాఖ్య
ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే..
కృష్ణానదిలో నీటి ప్రవాహం మొదలు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో మరో నాలుగు రోజుల్లో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో హంద్రీనీవా కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కాల్వపై ఉన్న పంప్‌హౌస్‌లలోని మోటర్లను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రధాన కాల్వలో ఉన్న కంప చెట్లను కూడా తొలగించారు. ఈ వారం చివరిలో కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ఏడాది కనీసం 8 పంప్‌లతో నీటిని లిఫ్ట్ చేయాలనే అలోచనలో ఉన్నారు.
చిక్కు ఎక్కడ వస్తుందంటే..
హంద్రీనీవా ఫేజ్–1 ప్రధాన కాల్వతో పాటు పంట కాల్వలకు 10285.55 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు సుమారు 9243.74 ఎకరాలు మాత్రమే సేకరించారు. పత్తికొండ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కిందే పంట కాల్వలకు 1800 ఎకరాలకుగాను 500 ఎకరాలు కూడా భూసేకరణ చేయలేక పోయారు. ఇందుకు రైతులు సహకరించడం లేదనే కుంటి సాకులు చెబుతున్నారు. భూములు కోల్పోయే రైతులు అడుగుతున్న పరిహారాన్ని ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రైతులతో కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసినా.. డిమాండ్ మేరకు పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. భూములు సేకరించిన చోట తీస్తున్న పంట కాల్వల వల్ల 14400 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుకునేందుకు 60 వేల ఎకరాలకు నీరు ఇస్తామని ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. జిల్లాలో ప్రవహించే 144 కి.మీ ప్రధాన కాల్వపై 12 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. అధిక శాతం పందికోన రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కిందనే అధికంగా ఉన్నాయి. మొత్తం 277 కి.మీ పంట కాల్వలు తీయాల్సి ఉండగా...20 కి.మీ కూడా తీయలేదు.
పనులు వేగంగా చేస్తున్నాం
పత్తికొండ ప్రాంతంలో పంట కాల్వలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వేగంగానే ఈ కాల్వల పనులు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కాల్వలతో 18 వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు. దీనికి మరో 10 వేల ఎకరాలకు ఈ ఏడాది నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది.
– కె.జలంధర్, హంద్రీనీవా సీఈ
ప్రాజెక్టు స్వరూపం
– వైఎస్సార్ హయాంలో 2004లో రూ. 1305 కోట్లతో ఈ కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
– రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం
– శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను 120 వరద రోజుల్లో 40 టీయంసీలు తరలించాల్సి ఉంది.
– ఈ కాల్వ కింద కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
– నందికొట్కూరు మండలం మాల్యాల దగ్గర మొదలైన ఈ కాల్వ జిల్లాలో 144 కి.మీ ప్రయాణించి అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది.