హెచ్చెల్సీకి నీరు బంద్
హెచ్చెల్సీకి నీరు బంద్
Published Mon, Nov 14 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
► ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటరీల షట్టర్లు దించేసిన
► పంటలకు డిసెంబర్ నెలాఖరు వరకు నీళ్లు అవసరం
► చివర్లో చేతులెత్తేసిన ప్రభుత్వంపై రైతన్నల ఆగ్రహం
కణేకల్లు :
కేటాయించిన నీటి వాటా పూర్తి కావడంతో తుంగభద్ర జలాశయం అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి హెచ్చెల్సీకి నీటి సరఫరా నిలిపేశారు. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి మొత్తం 10.50 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీవాహక ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది తుంగభద్రకు నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఆ మేరకు హెచ్చెల్సీ వాటాగా 10 టీఎంసీల నీరు కేటాయించారు.
కేసీ కెనాల్ నుంచి 1 టీఎంసీ నీరు డైవర్ష¯ŒS చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు. హెచ్చెల్సీకి నీటి సరఫరా ఆగిపోవడంతో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లో వరి, జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ పంటలను కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రా సరిహద్దు నుంచి కణేకల్లు మార్గమధ్యంలో హెచ్చెల్సీకి రెండు చోట్ల ఉన్న క్రాస్ షట్టర్లను పూర్తిగా దించేసి కాల్వలో నీరు నిల్వ చేసుకున్నారు. ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్ తర్వాత ఉన్న కురువళ్లి డిస్టిబ్య్రూటరీ, 1వ డిస్టిబ్య్రూటరీలోని పంటలను కాపాడేందుకు నాగాలాపురం వద్ద రైతులు షట్టర్లను దించేశారు. దీనివల్ల ఈ రెండు డిస్టిబ్య్రూటరీలకు మూడురోజులు నీరందే అవకాశముంది. 2, 2ఏ, 3, 4వ డిస్టిబ్య్రూటరీల రైతులు అంబాపురం వద్ద హెచ్చెల్సీకున్న షట్టర్లను దించారు. దీంతో ఈ నాలుగు డిస్టిబ్య్రూటరీలకు రెండు రోజుల పాటు నీరందుతుంది. హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో 36 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 25 వేల ఎకరాల్లో రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేశారు.
ప్రతి ఏటా డిసెంబర్ నెలాఖరు, జనవరి మొదటి వారం వరకు ఆయకట్టుకు సాగునీరు అందించేవారు. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా రెండవవారంలోనే హెచ్చెల్సీకి నీరు బంద్ కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి, జొన్న, మొక్కజొన్నలాంటి ఆరుతడి పంటలు బతకాలంటే డిసెంబర్ వరకు నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని రైతులు ఏదోక విధంగా పంటలను కాపాడుతామని చెప్పి చివరికి చేతులెత్తేసిని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు హెచ్చెల్సీకి నీరు తీసుకోవాలని అధికారులు అనుకున్నప్పటికీ డ్యామ్‌లో హెచ్చెల్సీ హెడ్‌కు నీరు పూర్తి స్థాయిలో అందకపోవడం, వస్తున్న కొద్దిపాటి నీరునూ కర్ణాటక వారు వాడుకుంటూ ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు ఆపేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో 11.368 టీఎంసీల నీరుంది.
300 క్యూసెక్కులు వస్తున్నాయి
ఈ నెల 15 వరకు పూర్తిస్థాయిలో నీరు తీసుకోవాలని అనుకొన్నాం. డ్యామ్‌లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. 1,591 అడుగుల వరకే నీరుండటంతో హెచ్చెల్సీ హెడ్ కు కావాల్సినంత నీరు అందడం లేదు. అరకొరగా వస్తున్న నీటిని కర్ణాటక వాళ్లే వాడుకుని 300 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఈ రోజు రాత్రికో, సోమవారం ఉదయానికో ఆ నీరు కూడా పూర్తిగా ఆగిపోతుంది. పంటలను సంరక్షించుకునేందుకు రైతులు నాగాలాపు రం, అంబాపురం వద్ద షట్టర్లను దించుకున్నారు. కణేకల్లు చెరువు కింద సాగులో ఉన్న పంటల కోసం చెరువు షట్టర్లను కూడా క్లోజ్ చేశారు.
– వెంకట సంజన్న, డీఈఈ
Advertisement
Advertisement