అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : తుంగభద్ర ఎగువ కాలువ( హెచ్చెల్సీ) ఆయకట్టులో వరి పంటను సాగుచేసే రైతులకు ఈసారీ మొండిచేయి చూపుతున్నారు. వర్షాభావం, నీటి లభ్యతను సాకుగా చూపి రైతులను దగా చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాదీ వరికి మంగళం పాడడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి జిల్లాకు కేటాయించిన మేరకు నీటిని తీసుకురావడంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యవసాయశాఖ అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో బోరుబావులు, ఇతర నీటి వనరుల కింద 50 వేల ఎకరాల్లోను, కేవలం హెచ్చెల్సీ కింద 60-70 వేల ఎకరాల్లోను వరి సాగు చేస్తున్నారు. అంతటిప్రాధాన్యమున్న హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది కూడా వరికి మంగళం పాడుతున్నారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే.. ఆయకట్టు పరిధిలో వరికి తప్పా మిగతా పంటలకు అనుకూలించని భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు కల్గిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు విడుదల చేసే ముందు సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో సభ్యులు తీర్మానించిన మేరకు పంటలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జిల్లాకు కేటాయింపుల మేరకు నీటిని తీసుకురావడానికి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఇదొక్క సమావేశమే అవకాశం. అయితే... ఈ ఏడాది సమావేశం నిర్వహించకుండానే నేరుగా పంటలకు నీటిని విడుదల చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. తొలుత పంచాయతీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి సమావేశాన్ని వాయిదా వేశారు. ఆగస్టులో నిర్వహిస్తామని ప్రకటించారు.
అయితే.. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమాలను సాకుగా చూపి ఐఏబీ తీర్మానం లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండో ఏడాదీ వరికి నీటిని విడుదల చేయకపోవడంపై ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు నిలదీస్తారనే భయంతో అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సూచన మేరకే ఐఏబీ సమావేశం నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హెచ్చెల్సీపై అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారు. కాలువ కింద సుమారు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతియేటా దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.కాగా... కొన్నేళ్లుగా వర్షభావం, తుంగభద్ర జలాశయంలో పూడిక చేరిందనే సాకుచూపి జిల్లాకు నీటి కేటాయింపుల్లో భారీగా కోత వేస్తున్నారు. నికరంగా 24 టీఎంసీలకు పైగా జిల్లాకు రావాల్సి ఉన్నా .. ఎప్పుడూ 20 టీఎంసీల లోపే వదులుతున్నారు. గతేడాది మరీ తక్కువగా 18 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. దీనివల్ల ఇటు పంటలకే కాకుండా అటు తాగునీటికీ కటకటలాడాల్సి వస్తోంది. నీటి కేటాయింపుల్లో కోత కారణంగా గతేడాది ఆయకట్టును భారీగా కుదించారు. 55 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు మాత్రమే నీరందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. హైలెవల్ మెయిన్ కెనాల్ కింద 17,500 ఎకరాలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఐదు వేలు, పీఏబీఆర్ సౌత్ కెనాల్ కింద పది వే లు, నార్త్ కెనాల్ కింద నాలుగు వేలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ) కింద ఆరు వేలు, మైలవరం బ్రాంచ్ కెనాల్ కింద ఐదు వేలు, పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) కింద 7,500 ఎకరాల్లో పంటలు సాగు చేయించాలని భావించారు. అయితే... చివరకు అన్ని ఉపకాల్వల కింద మొత్తం 67 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఏ సంస్కరణలు అమలు చేశారో ఈసారీ వాటినే అవలంబించాలని అధికారులు నిర్ణయించారు. తొలిప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని నిర్ణయించారు.
తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి గత నెల 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాగునీటి నిమిత్తం పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాంలలో నిల్వ చేశారు. ఈ నెల 8 నుంచి పంటలకు విడుదల చేస్తున్నారు. అయితే వరి సాగు చేయవద్దని అధికారులు రైతులకు చెబుతున్నారు. 80 రోజుల్లో పూర్తయ్యే జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వరి నారు వేసుకున్న రైతులు మాత్రం నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆతర్వాత వరి పంటకు పూర్తి స్థాయిలో నీరు వస్తుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు.
వరి రైతులకు మొండిచెయ్యేనా?
Published Mon, Aug 12 2013 5:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement