నిద్రలేని రాత్రులు గడపుతున్నాం..
* అన్నీ ఊరికేనా, దళితవాడను అభివృద్ధి చేయరా
* మంత్రి రావెలకు గోడును వెల్లబోసుకున్న వంగిపురం దళితవాడ మహిళలు
* ఎంత చెప్పినా నమ్మట్లేదంటూ మంత్రి రావెల అసహనం
వంగిపురం (ప్రత్తిపాడు): ‘కాలనీలో సరైన రోడ్లు లేవు. లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన ఇళ్లలోనికి నీళ్లు వస్తున్నాయి. మొన్న నిద్రలేని రాత్రి గడిపాం. అన్నీ నీళ్లే. అభివృద్ధి అంతా ఊర్లోనే చేస్తున్నారు. దళితవాడను అభివృద్ధి చేయరా’ అంటూ.. మంత్రి రావెలకు వంగిపురం దళితవాడ మహిళలు తమగోడును వెల్లబోసుకున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి రావెలను స్థానిక దళితవాడ మహిళలు చుట్టుముట్టారు. మా కాలనీకి ఎందుకు రోడ్లు వెయ్యరంటూ ప్రశ్నించారు. స్పందించిన మంత్రి రావెల కిషోర్‌బాబు పక్కనున్న పార్టీ నాయకుడు సర్పంచ్ భర్త, శెట్టిపాపయ్యను ఈ రోడ్డును మనం మంజూరు చెయ్యలేదా అంటూ ప్రశ్నించారు. మంజూరు చేశామని అయినా వాళ్లు పదేపదే చెయ్యలేదని చెబుతున్నారని తెలిపారు. దళితవాడ రోడ్లకు రూ.1.53 కోట్లు, మేడావారిపాలెం రోడ్డుకు రూ. 1.75 కోట్లు మంజూరయ్యాయని పాపయ్య వివరించారు. అయినా ఆయన సమాధానంతో మహిళలు శాంతించలేదు. దీంతో మంత్రి రావెల వీళ్లకు ఎంత చెప్పినా నమ్మట్లేదు.. అందుచేత ప్రతి గ్రామంలో మంజూరైన పనుల వివరాలు, పింఛన్లు వివరాలను పంచాయతీ కార్యాలయంపై పెయింటింగ్ వేయించాలని ఓఎస్డీ అర్జునరావుకు ఆదేశాలు జారీ ఆదేశించారు. అభివృద్ధి అంతా ఊరికే చేస్తున్నారని, మా కాలనీల ఓట్లు నాయకులకు అవసరం లేదా అంటూ మండిపడ్డారు. ఒక్కసారి ఊరు ఎలా ఉందో పల్లె ఎలా ఉందో చూడాలని వాపోయారు.