
కేంద్రంపై 'ప్రత్యేక' ఒత్తిడి తేవాలి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం కర్నూలులో ఐద్వా రాష్ట్ర నాయకురాలు టీసీ లక్ష్మమ్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఓ వైపు కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెబుతున్నా.. ముఖ్యమంత్రి ఇంకా ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం మాట మారుస్తున్నారని విమర్శించారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోని రెండు నదులకు జాతీయ హోదా కల్పించేందుకు సీఎం కృషి చేయాలన్నారు. రాయలసీమలో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం తీరును ప్రజలకు వివరించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాఘవులు తెలిపారు.