చిల్లర కష్టాలను ప్రధానికి వివరిస్తా
- చిన్ననోట్లు ఎక్కువ మొత్తంలో రాష్ట్రానికి పంపాలని కోరతా
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ‘పెద్దనోట్ల రద్దుతో చిల్లర కష్టాలు అధికమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన రూ.2వేల నోటును మార్చడం కష్టంగా మారింది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీల దృష్టికి తీసుకెళ్తా. చిన్న నోట్లు అధికంగా ముద్రించాలని సూచిస్తా’అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం ఆబిడ్స్‌లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆయన ఆదేశించారు. ఇకపై కార్మికుల వేతనాలన్నీ ఆన్‌లైన్ పద్ధతిలోనే పంపిణీ చేయాలని, చట్టం ప్రకారం వ్యవహరించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆన్‌లైన్ పద్ధతిలో వేతన పంపిణీకి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు.
గతనెల 26 నుంచి ఈనెల రెండో తేదీవరకు జిల్లా స్థాయిలో కార్మిక శాఖ, బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన ప్రచారంలో 56,286 మంది కార్మికుల నుంచి బ్యాంకు ఖాతాలకోసం దరఖాస్తులు తీసుకున్నామని, ఇందులో 30,674 మంది ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం క్రమం బయటకు వస్తుందన్నారు. కార్మికులకు నగదు రహిత విధానంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని, ఈ పద్ధతిపై విసృ్తత ప్రచారం కల్పిస్తే నోట్ల వాడకం తగ్గుతుందని, అదేవిధంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయన్నారు.
నోట్ల సమస్యలు పరిష్కరించాలి..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘నోట్ల ముద్రణ, రద్దు ప్రక్రియంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనిది. వీటిపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించలేం. దీనిద్వారా నెలకొన్న సమస్యల్ని మాత్రం తప్పకుండా పరిష్కారం చేయాలి. చాలాచోట్ల చిల్లర కష్టాలు బాగా ఉన్నాయి. అవసరమైనంతమేర నగదును బ్యాంకుల్లో ఆందుబాటులో పెట్టాలి. చిన్న నోట్లను ఎక్కువగా ముద్రించి బ్యాంకులకు పంపిణీ చేయాలి’అని ఆయన పేర్కొన్నారు.
కొన్నిచోట్ల కార్మికుడి చేతికి నగదు ఇవ్వడంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, రౌండ్ ఫిగర్ వేతనాన్ని ఇస్తూ చిల్లరను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ పద్ధతిలో పారదర్శకత ఉంటుందని, కంపెనీలు ఈ నిబంధనలు పాటించకుంటే కార్మిక శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ సీజీఎం వి.విశ్వనాథన్, కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ సంచాలకుడు కె.వై.నాయక్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.