ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేలా ఉంది. రైతులు, యువత, అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది గావ్, గరీబ్, కిసాన్, మజ్దూర్‌లకు సానుకూల బడ్జెట్. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం, పేదలకు గ్యాస్ కనెక్షన్లపై నిర్ణయం సంతోషకరమైన పరిణామం.
- బండారు దత్తాత్రేయ, కేంద్ర కార్మిక మంత్రి
బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా..
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రహదారులు, మౌలిక సౌకర్యాలు, స్టార్టప్ పరిశ్రమలకు సంబంధించి ఈసారి బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతిపాదనలను స్వాగతిస్తున్నాం. అవసరాల ఆధారంగా, రాజకీయాలకు అతీతంగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నాం..
ట్వీటర్‌లో కేటీఆర్
చిన్న పరిశ్రమలకు ఊతం..
బడ్జెట్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేదిగా ఉంది. పరిశ్రమలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు, స్టార్టప్‌లకు మూడేళ్లపాటు 100 శాతం పన్ను రాయితీ తదితరాలు పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహమిస్తాయి.
- తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి
తెలంగాణకు అన్యాయం
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. రైతుల సమస్యల పట్ల సరైన ప్రణాళిక ప్రకటించకపోవడం బాధాకరం. విద్యారంగానికి కేటాయింపుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు
వ్యవసాయానికి పెద్దపీట
బడ్జెట్‌లో వ్యవసాయానికి, నీటిపారుదలకు పెద్దపీట వేశారు. ఆరోగ్య భద్రత, విద్య, మౌలిక వసతుల కల్పన, ఉపాధి హామీకి నిధులు పెరిగాయి.
- జితేందర్‌రెడ్డి,లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత
రైతు సంక్షేమ బడ్జెట్
ఈ బడ్జెట్ రైతుల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడుతుంది. తెలంగాణకు తగిన ప్రాధాన్యమిచ్చి కేటాయింపులు చేశారు.
- జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇది తిరోగమన బడ్జెట్
బడ్జెట్ విదేశీ-స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు సంతోషం కలిగించేలా ఉంది. రైతాంగం పునాదిగా ఉన్న దేశ సామాన్య ప్రజలకు ఏమాత్రం మేలు చేసేలా లేదు. సాగుకు రూ.35 వేల కోట్లే కేటాయించడం రైతులపై కపటప్రేమే.
- కె.నారాయణ, సీపీఐ జాతీయకార్యదర్శివర్గ సభ్యుడు
పేదలకు లాభంలేని బడ్జెట్
బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయలేకపోయారు.
- చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కార్పొరేట్లకే అనుకూలం
ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెంచే విధంగా, కార్పొరేట్‌సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల జోలికి వెళ్లకపోవడం దుర్మార్గం.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
బడ్జెట్ పై తెలంగాణ నేతలు...
Published Tue, Mar 1 2016 3:01 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM
Advertisement