జనవరి చివరి నుంచి దశలవారీగా
న్యూఢిల్లీ: జనవరి చివరి నుంచి అసంఘటిత రంగంలోని కార్మికులకు స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశంలోని అసంఘటిత రంగంలో ఉన్న సుమారు 40 కోట్లమంది కార్మికులకు ‘యూ-విన్’ పేరుతో ఈ స్మార్ట్ కార్డులను ఇస్తామని ఆయన చెప్పారు. ఈ కార్డుల ద్వారా కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని మంత్రి తెలిపారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. దశలవారీగా యూ-విన్ (అనార్గనైజ్డ్ వర్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్) కార్డులను ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను ఈ కార్డుద్వారా పొందవచ్చని ఆయన వివరించారు.
మొదటి దశలో నిర్మాణ రంగ కార్మికులు, ఆటోలు, రిక్షాలను నడుపుకొనేవారికి వీటిని అందజేస్తామన్నారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ బీమా సదుపాయాలు, వృద్ధాప్య పెన్షన్లవంటివి వీటిద్వారా లభిస్తాయని చెప్పారు. బోనస్ బిల్లుకు సవరణలు తీసుకురావడంలో కృషి చేసినందుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, దత్తాత్రేయలను బీఎంఎస్ ఈ కార్యక్రమంలో సన్మానించింది.
కార్మికులకు ‘యూ-విన్’ కార్డులు: దత్తాత్రేయ
Published Thu, Dec 31 2015 1:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement