ఇక్కడే పుట్టాం.. ఎక్కడికీ వెళ్లం
- అభివృద్ధి పేరుతో గృహాల తరలింపు అన్యాయం
- న్యాయం కోసం మంత్రులను కలుస్తాం
- శ్రీశైలం నివాసితులు
శ్రీశైలం: ‘మేమంతా ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఇక్కడే ఉంటాం.. ఎక్కడికీ వెళ్లే ప్రసక్తి లేదు’ అంటూ శ్రీశైలం నివాసితులు గళమెత్తారు. శ్రీశైల దేవస్థానం పరిధిలోని వివిధ కాలనీ వాసులు శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశమై సున్నిపెంటకు గృహాల తరలింపు విషయంపై చర్చించారు. పార్టీలకతీతంగా జరిగిన ఈ సమావేశానికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. స్థానిక టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్న నివాసితులందరినీ సున్నిపెంటకు మార్చడం సరి కాదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైల నుంచి సున్నిపెంటకు తరలింపును ఎలాగైనా అడ్డుకుంటామన్నారు. గతంలో మిద్దెల గుడి వద్ద రెండు, మూడు దఫాలుగా చదును చేసి అక్కడ ఇళ్లను కట్టించి ఇస్తామని చెప్పిన దేవస్థానం అధికారులు ఇప్పుడు సున్నిపెంటకు తరలించాలని చూస్తే సహించేది లేదన్నారు. స్థానిక గిరిజన గూడెం నుంచి వచ్చిన చెంచులు సైతం అధికారుల తీరును తప్పుబట్టారు. అభివృద్ధి పేరుతో క్షేత్ర విశిష్టతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తమ తాతల కాలం నుంచి క్షేత్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు
గృహాల తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక కమిటీని (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన సమావేశంలో స్థానికులు తీర్మానించారు. అన్ని పార్టీల నాయకులతో కలసి ఆదివారం సమావేశంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొక్క కాలనీ నుంచి ఒక్కొక్కరి చొప్పున తీసుకుని, స్థానిక అధికార నాయకుల నేతృత్వంలో పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు. గృహాల తరలింపు విషయాన్ని జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.