అలసత్వం వహిస్తే సహించం
అలసత్వం వహిస్తే సహించం
Published Tue, Sep 13 2016 6:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
మున్సిపల్ ఆర్డీ చల్లా అనూరాధ
బాపట్ల: మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ ఆర్డీ చల్లా అనూరాధ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పురపాలకసంఘం అధికారులు, చైర్‌పర్సన్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనూరాధ మాట్లాడుతూ పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణం అసంతృప్తిగా నిర్వహిస్తున్నారని చెప్పారు. స్లమ్‌లెవల్ ఫెడరేషన్ (ఎస్‌ఎల్‌ఎఫ్) సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డి స్థాయి అధికారి సమావేశం నిర్వహిస్తే కనీసం హాజరుకాలేని సిబ్బందిని ఎందుకు నియమించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని, అలా చేయలేని పక్షంలో పనిచేయని వారిని గుర్తించి కొత్తవాళ్లకు అవకాశం కల్పించాలని సూచించారు. జిల్లాలో నరసరావుపేట, మంగళగిరి ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం 99 శాతం, తెనాలి, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో 87 శాతం పూర్తి అయితే బాపట్లలో కేవలం 70 శాతం మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. వార్డుల్లో మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కౌన్సిలర్లకు తెలియజేయాలే కానీ, కౌన్సిలర్ల అనుమతి తీసుకొని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. బాపట్లలో ఇప్పటివరకు ప్రజాసాధికారిత సర్వే కేవలం 40 శాతం మాత్రమే అయ్యిందని, మిగిలిన 60 శాతం సెప్టెంబర్ 25లోగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తోట మల్లీశ్వరి, మున్సిపల్ డీఈ సీతారామరావు, ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ పోతురాజు ఉన్నారు.
Advertisement