ఉద్యోగులపై దాడులను సహించం
- వెంటనే చర్యలు తీసుకుంటాం
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. చాగలమర్రి తహసీల్దార్ ఆంజనేయులుపై దాడి నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఉద్యోగులకు వంద శాతం అండగా ఉంటానని భరోసానిచ్చారు.ఉద్యోగులు తన కుటుంబ సభ్యులులాంటి వారని, వారిపై దాడులను సహించబోమని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. అధికారులు, ఉద్యోగులపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు దాడులకు పాల్పతున్నా ఎలాంటి చర్యలు లేవని ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్(యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు రామశేషయ్య ఆవేదన వ్యక్తం చేయడంతో కలెక్టర్ పైవిధంగా స్పందించారు. జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ...అదికారులపై దాడులకు పాల్పడం అమానుషమని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఉద్యోగులు కన్నెర్ర చేస్తే రాజకీయ పార్టీలు పతనం కావాల్సిందేనన్నారు.అధికారులు, ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌బాబు సూచించారు. తహసీల్దారుపై దాడి జరిగితే అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ రావడం విచారకరమన్నారు. దాడికి గురైన చాగలమర్రి తహశీల్దారు ఆంజనేయులు మాట్లాడుతూ.. ఒక మహిళా తహసీల్దారుపై ఇసుక మాఫియా దాడికి పాల్పడినా చర్యలు లేకపోవడం ఆందోళన కరమన్నారు. డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు, తహసీల్దార్లు, ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్, కోశాధికారి పి. రామకృష్ణారెడ్డి, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టిఎండీ హుసేన్, జిల్లా నేతలు గిరికుమార్‌రెడ్డి, రామన్న, వేణుగోపాల్‌రావు, నాగమణి, ఉద్యోగ సంఘాల నేతలు బలరామిరెడ్డి, సర్దార్ అబ్డుల్ హమీద్, నాగేశ్వరరావు, మద్దిలేటి, బాబు, రఘు తదితరులు పాల్గొన్నారు.