అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
– ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్‌లో వీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన వాల్మీకుల నిరవధిక సత్యాగ్రహానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడచిపోయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై ఇంతవరకు కార్యాచరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై వీఆర్‌పీఎస్ చేస్తున్న ఉద్యమాలకు రాజకీయాలకు అతీతంగా వాల్మీకులందరూ మద్దతు ప్రకటించాలన్నారు. జాతి శ్రేయస్సు కోసం చేపట్టే ఉద్యమాలకు తాను ఎల్లప్పడు అండగా ఉంటానని చెప్పారు.