రైతులను ఆదుకుంటాం : మంత్రి పల్లె
అనంతపురం అర్బన్ : జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కొద్ది సేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వాతావరణ బీమా కింద రాష్ట్రానికి రూ.434 కోట్లు మంజూరయ్యిందన్నారు. ఇందులో రూ.368 కోట్లు జిల్లా రైతులకు అందనుందని చెప్పారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రూ.1,800 కోట్లు పెట్టుబడి రాయితీ అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇటీవల అకాల వర్షాలతో జిల్లలో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు రూ.23.81 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలో జరగనున్న జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.