ఏపీని దోమల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపు
కర్నూలు(టౌన్): దోమల నిర్మూలనను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొని దోమల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుదామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో ‘దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు దోమలపై దండయాత్ర పేరుతో చేపట్టిన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దోమలతో ఇద్దరు మతి చెందడంతో ముఖ్యమంత్రి దోమల నిర్మూలనకు పెద్ద ఎత్తున్న చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు వ్యాప్తి చెందవన్నారు. అనంతరం హరితాంధ్ర ప్రదేశ్‌లో భాగంగా స్టేడియం ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎస్పీ ఆకె రవికృష్ణ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపేటలో మందు పిచికారీ చేసిన మంత్రి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి నగరంలోని ధర్మపేటలో పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. దోమలపై డండయాత్ర కార్యక్రమంలో భాగంగా మురుగు కాల్వల్లో మందును పిచికారీ చేశారు. నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.