అభివృద్ధి పేరిట ఆలయాల్లో ఒక్క ఇటుకరాయిని తొలగించినా సహించబోమని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు.
-శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి
విజయవాడ (మధురానగర్): అభివృద్ధి పేరిట ఆలయాల్లో ఒక్క ఇటుకరాయిని తొలగించినా సహించబోమని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు. వాటి పరిరక్షణకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల రక్షణ కోసం అవసరమైతే రాష్ట్రంలోని పీఠాధిపతులతో కలసి నిరాహారదీక్ష చేస్తామని పేర్కొన్నారు. పుష్కరాల పేరుతో ఆలయాలను తొలగించడం విచారకరమన్నారు. ఇక్కడ ఆలయాలను పడగొడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గోదావరి పుష్కరాల్లో 108 నాగప్రతిమలు, రెండు శివలింగాలను తొలగించి ఘాట్‌ను ఏర్పాటు చేయడం వల్లే అపశ్రుతి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక్కడా ఆలయాలు తొలగించి పనులు చేస్తున్నారన్నారు. దీనివల్ల అపశ్రుతులు జరగకుండా శుక్రవారం ఆలయాల్లో అఖండ నామసంకీర్తన, మూడోతేదీన హోమాలు, నాలుగున 352 పీఠాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధుసంత్‌ల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు.
బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ టీడీపీ నాయకులు గూండాలు, రౌడీల మాదిరిగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సమావేశంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.విద్యాధరరావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజు పాల్గొన్నారు.